CM Tour Restrictions: 11 గంటలకు సీఎం పర్యటన.. 7గంటలకే రోడ్లు బ్లాక్.. జనాలకు తప్పని ఇబ్బందులు - Common concern
Police restrictions: ముఖ్యమంత్రి పర్యటన ఉందంటే చాలు.. సామాన్య ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. ట్రాఫిక్, పోలీస్ ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సీఎం పర్యటనకు నాలుగైదు గంటల ముందు నుంచే పోలీసులు హడావుడి చేస్తుండడంతో ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. సీఎంను చూడాలనుకుంటున్న వారు సైతం నిరాశకు గురవుతున్నారు. దారి పొడవునా పరదాలు కట్టడంతో సీఎంను చూసే అవకాశం దక్కడం లేదని నిట్టూరుస్తున్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు కడపకు విచ్చేశారు. సీఎం కార్యక్రమం అధికారికంగా 11 గంటలకు ఉన్నా.. పోలీసులు ఉదయం 7 గంటలకే ఆంక్షలు విధించడంతో సామాన్య జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, ఆస్పత్రికి వెళ్లే రోగులు, వారి సహాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దారులు మూసేస్తే తాము ఎలా వెళ్లాలంటూ పలువురు వాహనదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మా చేతుల్లో ఏమీ లేదంటూ.. ఉన్నతాధికారులు చెప్పిన మేరకే నడుచుకుంటున్నామని పోలీసులు చెప్పారు. మరోవైపు ముఖ్యమంత్రి జగన్ వస్తున్నారని... ముందస్తుగా పలు విద్యార్థి సంఘాల నాయకులు, పలు పార్టీ నాయకులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. మరికొందరిని పోలీస్ స్టేషన్ కు తరలించి నిర్బంధించారు. చాలామందికి ముందస్తు నోటీసులు జారీ చేశారు.
పరదాల మాటున ప్రయాణం.. బస్సులో వెళ్లే సీఎం ఎవరికీ కనిపించకుండా పోలీసులు దారి పొడవునా పరదాలు కట్టారు. రాజీవ్ పార్కు చుట్టూ నివాసయోగ్యమైన ఇళ్లు ఉండటంతో... ప్రజలకు సీఎం కనిపించకుండా పది అడుగుల పైగానే ప్రహరీపైన పరదాలు కట్టారు. పార్కులోకి వచ్చినా జనాలకు సీఎం కనిపించలేదు. కొందరు ప్రజలు వారి మేడలపైకి ఎక్కి సీఎంను చూడాల్సిన పరిస్థితి వచ్చింది. పార్కులోకి వచ్చే సమయంలోనే సీఎం బస్సులోనే రావడంతో కొందరికి మాత్రమే సీఎం అద్దంలో నుంచి కనిపించడంతో మిగిలిన వారు నిరాశ చెందారు. నగరవాసులు ఎవ్వరూ పార్కులోకి వెళ్లకుండా పోలీసులు వారికి అడ్డంగా నిల్చుని ఆంక్షలు విధించారు. సీఎం రాజీవ్ పార్కుకు వస్తుండటంతో అప్పటికే రెండు గంటల పాటు విధుల్లో ఉన్న మహిళా వాలంటీర్ సొమ్మసిల్లి పడిపోయారు. ఉదయం నుంచి ఏమీ తినకపోవడం వల్లే పడిపోయానని వాలంటీర్ తెలిపారు. కాగా పరదాల మాటున సీఎం పర్యటన చేయడంపై అక్కడికి వచ్చిన ప్రజలు అసంతృప్తితో వెళ్లిపోయారు.