శ్రీవారి నడకదారిలో ఇంటెలిజెన్స్ డీఎస్పీ కృపాకర్ గుండెపోటుతో మృతి - మోదీ తిరుమల పర్యటన
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 25, 2023, 4:00 PM IST
DSP Krupakar Death Due to Heartattack at Tirumala: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరుమల పర్యటన నేపథ్యంలో విధులు చేపట్టడానికి వచ్చిన ఇంటెలిజెన్స్ అధికారి డీఎస్పీ కృపాకర్ (59) మృతి చెందారు. శ్రీ వారి మెట్టు నడక మార్గంలో డీఎస్పీకి గుండెపోటు రావడంతో అక్కడికక్కడే నేలకొరిగారు. దీంతో సిబ్బంది, స్థానికులు ఆయన మృతదేహాన్ని అశ్విని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
PM Modi Visit Tirumala : తిరుమల శ్రీవారి దర్శనం కోసం రేపు ( నవంబరు 26న ) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలో పర్యటించున్నారు. దండిగల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి రేపు సాయంత్రం 6:50 నిమిషాలకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమల శ్రీ రచన అతిథి గృహానికి చేరుకొని.. రాత్రికి బస చేయనున్నారు. ఎల్లుండి (నవంబరు 27న) ఉదయం 8 గంటలకు శ్రీవారిని దర్శించుకుంటారు. ఉదయం 10:25 నిమిషాలకు తిరుపతి నుంచి తెలంగాణలోని హకీంపేటకు ఎన్నికల ప్రచారం కోసం వెళ్లనున్నారు. మోదీ పర్యటనను దృష్టిలో పెట్టుకొని.. ఎల్లుండి శ్రీవారి బ్రేక్ దర్శనాలను రద్దు చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.