మాట తప్పను, మడమ తిప్పనని నిరుద్యోగులను మోసం చేశారు: ఎమ్మెల్సీ చిరంజీవి - ఏపీపీఎస్సీ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 12, 2023, 9:21 PM IST
DSC Candidates Protest in Avanigadda :ఏపీపీఎస్సీ ద్వారా 2 లక్షల 30వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెరవేర్చలేకపోయారని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ డీఎస్సీ ఎమ్మెల్సీ చిరంజీవి అన్నారు. మాట తప్పాను-మడమ తిప్పనని సవాలు చేసిన జగన్, ఇప్పుడు డీఎస్సీ నిరుద్యోగులకు ఏం చేశారని ప్రశ్నించారు. అవనిగడ్డలో డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సీఎం జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన మండలి సమావేశంలో రాష్ట్రంలో 18వేల ఉపాధ్యాయ పోస్టులు ఉన్నట్లు ప్రకటించినా ప్రభుత్వం మెగా డీఎస్సీ కాకుండా మినీ డీఎస్సీ ఎలా ప్రకటిస్తుందని ప్రశ్నించారు.
MLC Chiranjeevi Comments: అనంతపురం జిల్లాలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్న మల్లేష్ ఆత్మహత్యయత్నానకి పాల్పడిన ఘటన జగన్ ప్రభుత్వం దివాళా పరిస్థితికి ప్రత్యక్ష నిదర్శనమని చిరంజీవి అన్నారు. వారం రోజుల్లో సీపీఎస్ రద్దు అని ఉద్యోగులను నమ్మబలికి మోసం చేశారని ధ్వజమెత్తారు. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు నాలుగు నెలలుగా జీతాలు లేక నానా అవస్థలు ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు. జగన్ సర్కార్ ఉపాధ్యాయులను శత్రువులుగా భావిస్తూ అనేక ఇబ్బందులకు గురి చేస్తోందని ఆవేదన చెందారు. గతంలో కర్ణాటక, మహారాష్ట్రతో పోటీపడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు బిహార్‌తో పోటీపడుతుందని ఎద్దేవా చేశారు.