'ఆర్టీసీ, కారు డ్రైవర్ల మధ్య వివాదం' - పిడిగుద్దులతో దాడులు - వీడియో వైరల్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 24, 2023, 7:47 PM IST
|Updated : Nov 24, 2023, 7:57 PM IST
Dispute Between RTC and Car Drivers in Chittoor District : చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలో ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, కారు పక్కకు తొలిగే విషయంలో డ్రైవర్ల మధ్య వివాదం దాడులకు దారితీసింది. తిరుపతి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెదురుకుప్పం మండల పరిధిలోని పచ్చికాపల్లం మీదుగా.. కార్వేటి నగరం వైపు వెళ్తుంది. ఇదే మార్గంలో పచ్చికాపల్లం షెల్పెట్రోల్ బంక్ సమీపంలో ఎదురుగా వస్తున్న కారుకు.. దారి ఇవ్వలేదంటూ కారు నడుపుతున్న వ్యక్తి ఆర్టీసీ బస్ డ్రైవర్‌తో వాదనకు దిగాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య మాటామాటపెరిగి ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. మిగతా ప్రయాణికులు వారికి సర్ది చెప్పి పంపించేశారు.
అకారణంగా తనపై ఆర్టీసీ డ్రైవర్ దాడికి పాల్పడినట్లు కార్ డ్రైవర్ తమ బంధువులకు సమాచారం ఇవ్వడంతో.. ఘటనా స్థలం నుంచి కార్వేటి నగరం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును టీఆర్‌పురం జగనన్న కాలనీ సమీపంలో కారు యజమాని వర్గీయులు అడ్డగించారు. బస్ డ్రైవర్‌ను కిందకు దించి పిడిగుద్దులతో దాడి చేశారు. స్థానికులు సర్దిచెబుతున్నా లెక్కచేయలేదు. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై కారు యజమాని, ఆయన వర్గీయులు దాడి చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.