Tribal leaders on ycp: వైసీపీ నేతలను అడ్డుకున్న గిరిజన సంఘాలు.. పూలమాల వేయడానికి వీల్లేందంటూ.. - Ambedkar Birth Anniversary
Conflict Between YCP and Tribal Leaders: రాష్ట్రవ్యాప్తంగా భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పలువురు రాజకీయ నేతలు ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్నారు. అయితే అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో వైసీపీ నేతలు, ఆదివాసి గిరిజన సంఘ నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పాడేరులోని పాత బస్టాండ్ సెంటర్లో అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించడానికి వచ్చిన నాయకులను అడ్డుకున్నారు. బోయ, వాల్మీకులను ఎస్టీలో చేర్చడంపై వైసీపీ నాయకులకు వ్యతిరేకంగా నిరసన గళం వినిపించారు. గిరిజన ముద్దుబిడ్డ అయిన అంబేడ్క్ర్కు నివాళులు అర్పించే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోను లేదంటూ ఉద్యోగ, రాజకీయ సంఘ నేతలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. ఎస్టీ సెల్ వైసీపీ ప్రెసిడెంట్ వెంకట లక్ష్మి, ఎంపీపీలు సర్వసభ్య సమావేశంలో తీర్మానం పెడతామని చెప్పగా విరమించారు.
ఎంపీపీ, గిరిజన జేఏసీ నేతకు వాగ్వాదం: మరోవైపు పాడేరు అంబేడ్కర్ కూడలి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బోయ, వాల్మీకులను ST జాబితాలో చేరుస్తూ ప్రభుత్వం చేసిన తీర్మానానికి వ్యతిరేకంగా.. గత కొద్ది రోజులుగా గిరిజనులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అంబేడ్కర్ జయంతి సందర్భంగా విగ్రహం వద్దకు వచ్చి నివాళులర్పిస్తున్న వైసీపీ నేతలను.. గిరిజన సంఘాల నేతలు అడ్డుకుంటున్నారు. స్థానిక వైసీపీ MPP భర్తకు గిరిజన JAC నేత రామారావు దొరకు మధ్య కొంత వాగ్వాదం జరిగింది. పరస్పర తోపులాటకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక MLA అంబేడ్కర్ కూడలి వద్దకు వచ్చి నివాళులర్పించేందుకు కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.