విశాఖకు సీఎం జగన్ - అధికారులకు అందిన సమాచారం! ముహూర్తం ఎప్పుడంటే? - విశాఖ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 30, 2023, 10:14 AM IST
CM Jagan Stay in Visakha: ముఖ్యమంత్రి జగన్ డిసెంబర్ 8,9 తేదీల్లో విశాఖలో బస చేయనున్నట్లు జిల్లా యంత్రాగానికి అనధికారిక సమాచారం అందింది. డిసెంబరు నుంచి సీఎం విశాఖ నుంచే పాలన సాగిస్తారని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించటంతో ఈ సమాచారం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి పేరుతో విశాఖలోనే ఉంటూ సీఎం జగన్ సమీక్షలు నిర్వహిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్న విషయం తెలిసిందే.
AP Govt Offices Shifting to Vizag: ఈ నేపథ్యంలో నాలుగు లక్షల చదరపు అడుగుల ప్రాంతాన్ని వివిధ శాఖల అధికారుల కార్యాలయాలకు కేటాయిస్తూ.. ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. తాజాగా వచ్చేనెల 8వ తేదీ నుంచి రాష్ట్ర పాలన విశాఖ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికార వర్గాల్లో విస్తృత చర్చ నడుస్తోంది. మరోవైపు తమకు కేటాయించిన కార్యాలయాల గురించి వివరాలు తెలుసుకోవడానికి అమరావతి నుంచి పలువురు అధికారులు, జిల్లా అధికారులకు ఫోన్లు చేసి ఆరా తీస్తున్నారు.