Children Trafficking in AP: రాష్ట్రంలో పెరిగిన బాలల అక్రమ రవాణా.. దేశంలోని తొలి మూడు రాష్ట్రాల్లో ఏపీ - Crime news
Children Trafficking in AP: రాష్ట్రంలో బాలల అక్రమ రవాణా ఘటనలు కొవిడ్ ముందుతో పోలిస్తే చాలా ఎక్కువయ్యాయి. 2016-20 మధ్య ఏపీలో బాలల అక్రమ రవాణాకు సంబంధించి 50 ఘటనలు చోటు చేసుకోగా.. 2021-22లో ఆ సంఖ్య ఏకంగా 210కు పెరిగింది. దేశంలో బాలల అక్రమ రవాణా అత్యధికంగా జరుగుతున్న తొలి మూడు రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. మనతో పాటు ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో అత్యధికంగా ఇలాంటి ఘటనలు నమోదవుతున్నాయి. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్నిపుర స్కరించుకుని కైలాస్ సత్యార్థి చిల్డ్రన్స్ ఫౌండేషన్, గేమ్స్ 24 సెవన్ సంస్థలు భారత్‌లో బాలల అక్రమ రవాణా సమాచార విశ్లేషణ.. పేరిట నివేదిక విడుదల చేశాయి. 21 రాష్ట్రాల పరిధిలోని 262 జిల్లాల్లో కేఎస్సీఎఫ్, దాని భాగస్వామ్య సంస్థలు కలిసి బాలల సమాచారాన్ని విశ్లేషించి ఈ నివేదికలో పొందుపరిచాయి. దాని ప్రకారం రాష్ట్రంలో కొవిడ్ తర్వాత అక్రమ రవాణాకు గురైన బాలల సంఖ్య సగటున 68 శాతం పెరిగిందని వివరించింది. దేశ రాజధాని ఢిల్లీ లోనూ ఇలాంటి పరిస్థితే ఉందని పేర్కొంది.