Chandrababu tour: చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల సందర్శన.. తెలుగు తల్లికి జలహారం పేరుతో పర్యటన - AP Latest News
Chandrababu Jalharam tour: ఆగస్టు ఒకటో తేదీ నుంచి తెలుగుదేశం అధినేత చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టులను సందర్శించనున్నారు. పెన్నా టూ వంశధార తెలుగు తల్లికి జలహారం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో.. నిలిచిపోయిన ప్రధాన జలవనరుల ప్రాజెక్టులను క్షేత్రస్థాయికి వెళ్లి చంద్రబాబు పరిశీలించనున్నారు. కర్నూలు జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు జలహారం యాత్ర సాగనుంది. పెన్నా నుంచి వంశధార ప్రాజెక్టు వరకు ఉన్న ప్రధాన నదులపై ఉన్న కీలక ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. ఇరిగేషన్ రంగంలో జగన్ ప్రభుత్వ వైఫల్యాలను రోడ్ షోలు, సభల ద్వారా ఎండగట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్ర స్వరూపాన్ని మార్చే నదుల అనుసంధానం ప్రక్రియకు వైసీపీ సర్కార్ తూట్లు పొడిచిందని మండిపడ్డారు.. అయా ప్రాజెక్ట్‌ల వద్ద తెలుగుదేశం హయాంలో జరిగిన పనులు.. వైసీపీ హయాంలో నిలిచిన పనులపై ప్రజలను చైతన్య పరిచేలా యాత్ర ఉంటుందని టీడీపీ వర్గాలు స్పష్టం చేశాయి. ఆగస్టు 1న కర్నూలు జిల్లా నుంచి యాత్ర ప్రారంభం కానుంది. మొదటి నాలుగు రోజుల్లో కర్నూలు, కడప, అనంతపూర్, చిత్తూరు జిల్లాలలోని ప్రాజెక్టుల సందర్శించనున్నారు.