కృష్ణాజిల్లాలో అరుదైన బ్రహ్మకమలాలు.. భక్తుల పూజలు - గన్నవరం లేటెస్ట్ న్యూస్
Brahma Kamalas Blooming: హిమాలయాల్లో మాత్రమే వికసించే అరుదైన "బ్రహ్మకమలాలు" కృష్ణా జిల్లాలో విరబూశాయి. అవునండీ మీరు విన్నది నిజమే!.. పరమ శివునికి ఎంతో ఇష్టమైన బ్రహ్మకమలం.. విజయవాడ ఆర్టీసీ కాలనీలోని పొట్లూరి బాలగంగాధర్ తిలక్, సరోజ దంపతుల ఇంట్లో పూశాయి. ఒకేసారి ఐదు పూలు వికసించి చూసేందుకు చాలా చక్కగా ఉన్నాయి. అలాగే.. గన్నవరంలో ఏపీ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాంబశివరావు సోదరి స్వరాజ్యం ఇంట్లో కూడా సోమవారం రాత్రి 11.30 గంటల సమయం నుంచి బ్రహ్మకమలం పుష్పించడం ప్రారంభించింది. 12.30 గంటలకు పూర్తిగా వికసించింది. మూడేళ్ల క్రితం చిన్న మొక్కను హైదరాబాద్ నుంచి తీసుకునిరాగా.. ఇప్పటికి అది పుష్పించిందని స్వరాజ్యం తెలిపారు. అయితే తమ ప్రాంతంలో బ్రహ్మకమలం పుష్పించడంతో ఇంట్లో వారితో పాటు స్థానికులు పూజలు నిర్వహించారు. పరమ శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ పువ్వు హిమాలయాల్లో ఏడాదికి ఒకమారు ఒక చెట్టుకు ఒకేపువ్వు మాత్రమే పుష్పిస్తుందని, అయితే ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న సమయాల్లో ఈ పూలు ఒకే చెట్టుకు నాలుగైదు ఒకేసారి పూస్తాయని స్థానికులు అంటున్నారు. ఈ దృశ్యం రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా కన్పిస్తుందని చెబుతున్నారు. కాగా.. మునులు, ఋషులు, తపశ్విలు ఈ పూలతో పరమ శివుడిని అర్చిస్తారని పలువురు అంటున్నారు.