Bogus Votes in AP : ' 37 మంది ఓటర్లకు తండ్రి పేరు ఒకటే'.. విచారణ చేపట్టిన అధికారులు - ఈనాడు దినపత్రికలో ప్రచురించిన కథనానికి స్పందన
Bogus Votes in Anakapalli: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దొప్పెర్లలో అక్రమ ఓట్లపై '37 మంది ఓటర్లకు తండ్రి పేరు ఒక్కటే' అనే శీర్షికతో 'ఈనాడు' దినపత్రికలో ప్రచురించిన కథనానికి ఎన్నికల కమిషన్ స్పందించింది. విచారణ జరిపి సమగ్ర నివేదిక అందించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ మేరకు ఎలమంచిలి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జ్ఞానవేణి విచారణ చేపట్టారు. గ్రామంలో ఇంటింటా సర్వే నిర్వహించారు. ఒక్క ఓటు తప్పుగా ఉన్న తొలగిస్తామని జ్ఞానవేణి అన్నారు. పత్రికలో ప్రచురించిన విధంగా 37 ఓట్లలో 25 ఓట్ల నమోదులో అవకతవకలు జరిగాయని తెలిపారు. వీరిలో చాలా మంది ఆ గ్రామంలో నివసించడం లేదని, సరోజారావుకు చిన్న పాప మాత్రమే ఉందని అన్నారు.ఓటు హక్కున్న కుమారులు, కుమార్తెలు ఎవరూ లేరని అన్నారు.
ఇవన్నీ వైసీపీ అనుకూలంగా చేర్చుకున్న బోగస్ ఓట్లని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గ్రామంలో 1,274 మంది ఓటర్లు ఉండగా అందులో 130 వరకూ బోగస్ ఓట్లే ఉన్నాయని ఆ గ్రామ ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవని అంటున్నారు. ఒకే డోర్‌నంబరుతో పదుల సంఖ్యలో ఓటర్లను నమోదు చేశారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైసీపీ లబ్ధి కలిగేలా అప్పట్లో ఒక కుటుంబంలోని ఓటర్లను రెండు, మూడు వార్డులలోకి విభజించారని, అదే పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతోందని అన్నారు.