Purandeswari: నిధుల మళ్లింపు.. నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లిన పురందేశ్వరి - Nirmala Sitharaman
Purandeswari Met Nirmala Sitharaman:రాష్ట్రంలో అప్పులు, ఆర్థిక అవకతవకలపై దృష్టి సారించాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కోరారు. ప్రభుత్వం నాలుగేళ్ల కాలంలో 7 లక్షల 14 వేల కోట్ల అప్పుల భారాన్ని ప్రజలపై మోపిందని తెలిపారు. మద్యంపై భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని చూపి 8 వేల కోట్లు అప్పు చేసిందని అన్నారు. పంచాయతీల నిధులను సైతం దారి మళ్లిస్తోందని ఆర్థికమంత్రి దృష్టికి పురందేశ్వరి తీసుకొచ్చారు. కార్పొరేషన్ల ద్వారా చేస్తున్న అప్పులు అధికారికమో.. అనధికారికమో ప్రభుత్వం ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆస్తులకు తనఖా పెట్టి చేసిన అప్పుల గురించి వివరణ ఇవ్వాలని.. కాంట్రాక్టర్లకు పెండింగ్‌లో ఉన్న వేల కోట్ల బిల్లులపై కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు. అదేవిధంగా 15వ ఆర్థిక సంఘం నిధులను సర్పంచులకు ఎందుకు ఇవ్వడం లేదని.. ఆ నిధులను ప్రభుత్వం అనధికారికంగా వాడుకుందని ఆరోపించారు. వీటన్నింటిపైనా ప్రభుత్వం తగిన సమాధానం చెప్పాలని అన్నారు.