Secretariat Employees Dharna ఇక్కడ విధులు నిర్వహించలేకపోతున్నాం.. మౌన దీక్షలో సచివాలయ ఉద్యోగులు! - Attack Secretariat employees support ruling party
Secretariat Employees Protest in Kadapa : కడప నగరపాలక కార్యాలయం ఎదుట సచివాలయ కార్యదర్శులు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని మౌన దీక్ష చేపట్టారు. కడప నగరంలో తమకు రక్షణ కావాలి.. నిబంధనల ప్రకారం విధులు నిర్వహిస్తున్నప్పటికీ అధికార పార్టీ అండదండలతో కొందరు వ్యక్తులు తమపై దాడికి పాల్పడ్డారని సచివాలయ కార్యదర్శి రామ్మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. కడప శివారులోని ఫకీర్ పల్లి చెరువు వద్ద కొంతమంది నిబంధనలకు వ్యతిరేకంగా భవనాలను నిర్మిస్తున్నారు. తాము అక్కడికి వెళ్లి పరిశీలించగా నిబంధనల మేరకు లేకపోవడంతో సంబంధిత ఇంటి యజమానులు కార్యాలయానికి వచ్చి సంప్రదించాలని సూచించామన్నారు. కానీ శుక్రవారం సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు సంబంధిత సచివాలయ కార్యాలయం వద్దకు వచ్చి విధుల్లో ఉన్న సచివాలయ కార్యదర్శి రామ్మోహన్‌పై, అదే సమయంలో అక్కడే ఉన్న వీఆర్వోపై కూడా దాడి జరిగిందని బాధితులు ఆరోపించారు. గతంలో కూడా ఇలాంటి దాడులు తమపై జరిగాయని సచివాలయ ఉద్యోగులు వాపోయారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా ఉండాలంటే దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.