Praveen Prakash విద్యార్థుల వద్ద పాఠ్యపుస్తకాలు లేకపోతే... దానికి ఉపాధ్యాయులే బాధ్యులు: ప్రవీణ్ ప్రకాష్ - తెనాలి వార్తలు
AP Education Principal Secretary: విద్యార్థుల వద్ద పాఠ్యపుస్తకాలు లేకపోతే దానికి బాధ్యులు ఉపాధ్యాయులేనని పాఠశాల ఏపీ విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఉపాధ్యాయులను హెచ్చరించారు. తెనాలిలోని రావి రవీంద్రనాథ్ నగర్లోని ఏపీటీడబ్యూఆర్ బాలికల పాఠశాలతో పాటుగా పలు పాఠశాలలను తనిఖీ చేశారు. తొలుత విద్యార్థులతో మాట్లాడుతూ పుస్తకాలు, డిక్షనరీ లేనివారు ఎవరైనా ఉన్నారా అంటూ ప్రశ్నించారు. దీంతో కొందరు విద్యార్థులు తమవద్ద డిక్షనరీ లేదని చెప్పారు. గతేడాది కూడా కొందరికి డిక్షనరీ ఇవ్వలేదని చెప్పారు. దీంతో ఆయన డిక్షనరీ లేనివారిని, డిక్షనరీ ఉన్నవారిని రెండు బ్యాచ్లుగా విభజించారు. మండల విద్యాధికారి ఎం. లక్ష్మీనారాయణ, పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి.విజయ్కుమార్ను విద్యార్థుల వద్ద డిక్షనరీలు, కొందరి వద్ద పుస్తకాలు లేవని, కారణమేమిటని ప్రవీణ్ ప్రకాష్ ప్రశ్నించారు. వారి నుంచి సరైన సమాధానం రాకపోవటంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎవరూ సరిగా పనిచేయటం లేదని, విద్యార్థులతో రివ్యూ చేయటంలేదని ఆగ్రహించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ప్రవీణ్ ప్రకాష్ తనకూ ఎవ్వరిమీదా కోపంలేదని, విద్యార్థుల భవిష్యత్ కోసమే కఠినంగా మాట్లాడాల్సి వస్తోందన్నారు. ప్రతి విద్యార్ధి చదువు ప్రభుత్వానికి ముఖ్యమన్నారు. వారి వద్ద పుస్తకాలు లేకుంటే దానికి ఉపాధ్యాయులే బాద్యులన్నారు. మళ్లీ త్వరలోనే వాట్సాప్ కాల్ లో విద్యార్థులతో మాట్లాడతానని, పరిస్థితిలో మార్పురావాలని వెల్లడించారు. లేని పక్షంలో ఉపాధ్యాయులపై చర్యలు తప్పవన్నారు. విద్యార్థులకు మెటీరియల్ అందుబాటులో ఉంచే బాధ్యత ఎంఈవో, డీఈవోది కూడా అని స్పష్టం చేశారు. అలాగే విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ పుస్తకాలు ఇంటి వద్ద ఉంచకూడదని, పాఠశాల్లో తమతోపాటే ఉంచుకోవాలన్నారు. కష్టపడి చదువుకోవాలని చెప్పారు.స్వయంగా ప్రకాష్ ఇంటి ఇంటికి తిరుగుతూ ఇళ్లకు వెళ్లి విద్యార్థుల తల్లి తండ్రులను పుస్తకాలు,మెటీరియల్ ,వివరాలు అడిగి తెలుసుకున్నారు కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.