ANM Suicide Attempt: వైద్యాధికారి వేధింపులు! నిద్రమాత్రలు మింగి ఏఏన్ఏమ్ ఆత్మహత్యాయత్నం.. సిబ్బంది ఆందోళన - Eluru District Latest News
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 8, 2023, 7:33 PM IST
ANM Suicide Attempt in Eluru District :వైద్యాధికారి తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఓ ఏఎన్ఎమ్ ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన ఏలూరు జిల్లా లింగపాలెంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. లింగపాలెం వైద్యాధికారి సంధ్యా రాణి ఏ కారణం లేకుండా తనకు పనిష్మెంట్ ఇచ్చారని సచివాలయం ఏఎన్ఎమ్ శ్రావణి ఆరోపించింది. తన చావుకు కారణం వైద్యాధికారి సంధ్యారాణితో పాటు మరో ఉద్యోగి రాజేశ్వరి అని లెటర్ రాసి సచివాలయం సిబ్బంది వాట్సప్ గ్రూప్లో పోస్ట్ చేసింది. అనంతరం నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
దీనిని గుర్తించిన కుటుంబ సభ్యులు చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తోటి సిబ్బంది ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు. సంధ్యారాణి మిగిలిన సిబ్బందిని కూడా ఇదే తరహాలో వేధింపులకు గురి చేసే వారని సిబ్బంది ఆరోపించారు. గతంలో పనిష్మెంట్గా రెండు మూడు గంటలు స్టోర్ రూమ్లో ఉంచిన సందర్భాలు ఉన్నాయని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. శ్రావణిపై వేధింపులకు పాల్పడిన వైద్యాధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.