Protest against YSRCP MLA డబ్బులొద్దు.. అభివృద్ది కావాలి! వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేకు పరాభవం! వీడియో వైరల్ - Protest against YSRCP MLA Gol Kirankumar
Protest against YSRCP MLA Gol Kirankumar: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు వారి వారి నియోజకవర్గాల్లో నిరసన సెగలు తప్పటం లేదు. ఆ పార్టీ అధినేత సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో నాయకులకు చేదు అనుభవాలు, పరాభవాలు ఎదురైతున్నాయి. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వెళ్లిన ప్రతి ఎమ్మెల్యేను, ఎంపీని, ఎమ్మెల్సీని.. ఓట్లేసి గెలిపినందుకు ఊరి కోసం, యువత కోసం, రైతులు కోసం ఏం చేశారంటూ నిలదీస్తున్నారు. నాలుగేళ్ల పాలనలో గ్రామాల్లో ఏ మంచి పని చేశారో..? చెప్పండి అంటూ యువత, గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. దీంతో నాయకులు సమాధానాలు చెప్పలేక అక్కడి నుంచి వెనుతిరుగుతున్నారు. తాజాగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గోల్ కిరణ్ కుమార్‌కు అలాంటి అనుభవమే ఎదురైంది.
మా గ్రామానికి ఏ మంచి పని చేశారో చెప్పండి..?.. లావేరు మండలం గోవిందపురం పంచాయతీ రాయునిపాలెంలో ఈరోజు నిర్వహించిన 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో ఎమ్మెల్యే గోల్ కిరణ్ కుమార్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా పార్టీ కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ క్రమంలో జనసైనికులు, ఆ గ్రామ యువత ఎమ్మెల్యేను నిలదీశారు. వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతుందని.. తమ గ్రామానికి ఏం చేశారో చెప్పాలంటూ ప్రశ్నించారు. మంచి నీటీ సమస్య, రోడ్ల మరమ్మతుల సమస్య, కరెంట్ సమస్యలు అలాగే ఉన్నాయని ఎమ్మెల్యేకు గ్రామస్థలు గుర్తు చేశారు.
ప్రతి ఇంటికి డబ్బులు ఇస్తున్నాం కదా..! ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గోల్ కిరణ్ కుమార్ స్పందిస్తూ.. 'ప్రతి ఇంటికి డబ్బులు ఇస్తున్నాం' కదా అని జవాబు ఇచ్చారు. దీంతో స్థానిక యువత ఆగ్రహంతో రగిలిపోయి.. ''మాకు డబ్బులు అవసరం లేదు. అభివృద్ధి చేస్తే చాలు. మీ ప్రభుత్వం వచ్చాక ఎమ్మెల్యేలను నిలదీసినందుకు పోలీస్ స్టేషన్‌కు తరలించి, హింసలు పెట్టి విడిచిపెడుతున్నారు. సమస్యలు అడిగితే పట్టించుకోవటం లేదు.'' అని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం జి సిగడాం మండల కేంద్రంలో బీసీ కాలనీలో ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌ను ఓ మహిళ రోడ్లు లేవు, కాలువలు శుభ్రం చేయడం లేదు, త్రాగునీరు సక్రమంగా లేదని నిలదీసింది. ఆ తర్వాత ఎచ్చెర్ల నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యేకు ప్రజలు నుంచి ప్రతి గడపలోను ప్రశ్నల పర్వం ఎదురైంది. చివరికి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఏమీ చేయలేక అక్కడి నుంచి ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్ అక్కడి నుంచి వెనుతిరిగారు.
మాకు డబ్బులు వద్ద-అభివృద్ధి చేస్తే చాలు.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గోల్ కిరణ్ కుమార్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్‌గా మారింది. ఆ వీడియోలో..'ఎవడో అడిగితే సమాధానం చెప్పాల్సిన పనిలేదు నాకు.. మీరు వీడియోలు తీసిన నాకు భయం లేదు. ప్రతి ఇంటికి డబ్బులు ఇస్తున్నాం కదా. నీ సమస్య ఏంటో చెప్పు.. నాలుగేళ్లలో ఏం చేశారు అనేది నీకెందుకు..?' అంటూ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ అసహనం వ్యక్తం చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఎమ్మెల్యే మాటలకు ప్రతి సమాధానంగా.. 'రేపు ఎన్నికల సమయంలో నువ్వు అడిగినా నీకు ఓటేయాల్సిన పనిలేదు మాకు. మాకు డబ్బులు అవసరం లేదు. అభివృద్ధి చేస్తే చాలు' అంటూ నియోజకవర్గం ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.