Amaravati Farmers Protest Against Chandrababu Arrest: జగన్ అరెస్ట్ అయితే.. తల్లి, చెల్లి, భార్య మాత్రమే రోడ్డుపైకి వచ్చారు..: రైతులు - news on Protests Over Chandrababu Arrest
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 17, 2023, 5:58 PM IST
Amaravati Farmers Protest Against Chandrababu Arrest: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడి అరెస్ట్‌ను నిరసిస్తూ రాజధానిలో రైతులు, మహిళలు సామూహిక రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. 29 గ్రామాలకు చెందిన రైతులు, మహిళలు... అంతా కలిసి తుళ్లూరులో జరిగిన దీక్షలో పాల్గొన్నారు. తెలుగు రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి. శ్రీనివాసరెడ్డి దీక్షలో పాల్గొన్న వారికి దండలు వేసి రిలే నిరాహారదీక్షలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన రైతులు ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ కు వ్యతరేకంగా నినాదాలు చేశారు.
అమరావతి రూపశిల్పి చంద్రబాబును అన్యాయంగా జైల్లో పెట్టారని రైతులు ఆరోపించారు. అక్రమాస్తుల కేసులో జగన్ అరెస్టైన సమయంలో... ఆయన వెంట తల్లి, చెల్లి, భార్య తప్పా ఎవరూ లేరని ఎద్దేవా చేశారు. కానీ నేడు చంద్రబాబును అన్యాయంగా జైల్లో పెడితే రాష్ట్ర ప్రజలు స్వచ్ఛందంగా రోడ్ల పైకి వస్తున్నారని తెలిపారు. దీన్నిబట్టి అక్రమాలు చేసింది ఎవరో అర్థం చేసుకోవచ్చని రైతులు వెల్లడించారు. బాబును జగన్ కుట్రతో జైల్లో పెట్టారని.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఈ ప్రభుత్వానికీ కనువిప్పు కలగడం లేదని ఆరోపించారు.