AITUC Round Table Meeting: 'ప్రత్యేక హోదా, విభజన హామీలు నేరవేర్చకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తాం' - విజయవాడ తాజా వార్తలు
Aituc Round Table Meeting In Vijayawada: కడప ఉక్కు కర్మాగారం, దుగరాజపట్నం పోర్టు నిర్మాణం, విశాఖ రైల్వే జోన్ అంశాలపై.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ విజయవాడలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. గత తొమ్మిదేళ్లుగా కేంద్రం పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలను అమలు చేయకుండా.. తాజాగా పార్లమెంట్లో విభజన హామీలను నెరవేర్చడం సాధ్యం కాదని చెప్పడాన్ని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు తీవ్రంగా ఖండించారు. 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా, విభజన హామీలను సాధిస్తామన్న సీఎం జగన్.. ఇప్పుడు బీజేపీ ముందు మోకరిల్లుతున్నారని ఏపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతున్నారని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మీ విమర్శించారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించాలనే ప్రయత్నం మానుకోవాలని ఆమె సూచించారు. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తున్నా.. వైసీపీ, టీడీపీ, జనసేనలు బీజేపీకి మద్దతు పలకడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆమె అన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలను నేరవేర్చకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.