YSRCP leaders in land dispute: వైసీపీ నాయకుల అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. నిత్యం ఏదో ఒకచోట భూఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి. వారి ఆగడాలు భరించలేక బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అక్కడ కూడా న్యాయం జరగకపోవడం వల్ల ప్రాణాలు సైతం తీసుకుంటున్నారు. కానీ ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలో ఇలాంటి ఘటనే జరగగా.. బాధితులు ఊరుకోలేదు... తిరగబడ్డారు.. వైసీపీ నాయకులు కళ్లలో కారం చల్లి తరిమి తరిమి కొట్టారు. కానీ ఇది జీర్ణించుకోలేని ఆ నాయకుల అనుచరులు ఆ కుటుంబానికి చెందిన ఇంటిపై దాడికి పాల్పడి.. ధ్వంసం చేశారు. పోలీసులను ఆశ్రయించినా వారికే వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం గుండాపురంలో బత్తల సిద్ధయ్య 15 ఏళ్లుగా రెండెకరాల ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్నారు. ఈ భూమి తన పేరిట ఆన్లైన్లో నమోదు అయిందంటూ అదే గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు రమణారెడ్డి.. ఆరు నెలలుగా వాదిస్తున్నారు. నాలుగైదు రోజులుగా రమణారెడ్డికి, సిద్ధయ్యకు మధ్య వివాదం తీవ్రమైంది. ఇవాళ ఏకంగా జేసీబీ, ట్రాక్టర్లతో పొలం ఆక్రమణకు వచ్చిన రమణారెడ్డిని.. పొలంలోనే ఉన్న బత్తల సిద్ధయ్య కుటుంబం ఎదిరించింది. సాగు చేసుకుంటున్న భూమిని ఆక్రమిస్తారా అంటూ కారం చల్లి... రాళ్లు, కర్రలతో వెంటబడి తరిమారు. ఈ దాడిలో గాయపడిన వైకాపా నాయకులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.