అక్రమాలను ఎత్తిచూపినందుకు కడప జిల్లాలో అధికార పార్టీకి చెందిన గురునాథ్‌రెడ్డి అనే కార్యకర్త... సొంతపార్టీ నేతల చేతిలోనే దారుణ హత్యకు గురయ్యాడు. జమ్మలమడుగు నియోజకవర్గంలో వైకాపాలో తూర్పు-పడమరగా ఉన్న ఇద్దరు పార్టీ ముఖ్యనేతల అనుచరుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటన అధిష్ఠానం దృష్టికి వెళ్లినట్టు సమాచారం.
వివరాల్లోకి వెళితే...
కడప జిల్లా కొండాపురం మండలం పి.అనంతపురంలో... వైకాపా కార్యకర్త గురునాథ్ రెడ్డి హత్యకు గురయ్యాడు. పార్టీలోని రెండు వర్గాలు పరస్పరం చేసుకున్న రాళ్లదాడిలో గురునాథ్ రెడ్డి చనిపోయాడు. గండికోట జలాశయ ముంపు పరిహార పంపిణీలో అవకతవకలే హత్యకు ప్రధాన కారణమని ఆరోపణలు వస్తున్నాయి. ఇళ్లు కోల్పోయిన వారికి పరిహారం కింద ప్రభుత్వమిచ్చే 10 లక్షలను.... కొందరు అనర్హులకూ ఇచ్చారని కొంతకాలంగా విమర్శలు ఉన్నాయి. ఈ విషయమై... గురునాథ్‌రెడ్డి ఏడాదిగా కలెక్టర్, స్థానిక రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అనర్హులను తొలగించి అర్హులకు న్యాయం చేయాలని మరోసారి ఫిర్యాదు చేయడంతో... జీఎన్ఎస్ఎస్ స్పెషల్ కలెక్టర్ రోహిణి.... శుక్రవారం పి.అనంతపురంలో గ్రామసభ ఏర్పాటు చేశారు. గ్రామంలో రమేష్‌రెడ్డి, గురునాథ్‌రెడ్డి వర్గాలుండగా.... రమేష్‌రెడ్డి వర్గీయుల పేర్లు ఉన్నాయని గురునాథ్‌రెడ్డి ఫిర్యాదుతోనే గ్రామసభ నిర్వహించారు.