'నా భర్త నాకు కావాలి... లేదంటే చావే శరణ్యం' - cheated
అందరికీ న్యాయం చేయాల్సిన ఓ ఎస్ఐ... తనకు అన్యాయం చేశాడంటూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనను పెళ్లి చేసుకుని.. ఓ బిడ్డ పుట్టాక అనుమానం పేరుతో దూరం పెట్టాడని ఆరోపించింది. తప్పుడు కేసులతో వేధిస్తున్నాడని మీడియాకు తెలిపింది.
ఓ ఎస్సై తనను పెళ్లి చేసుకుని మోసం చేశారంటూ రాజకుమారి అని మహిళ మీడియా ఎదుట వాపోయింది. తన బిడ్డకు తండ్రి కావాలంటూ ఆవేదన చెందింది. కడప ప్రెస్కబ్లో ఆమె మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.... ''జిల్లాలోని సింహాద్రిపురం మండలం కసునూరుకు చెందిన రాజకుమారికి కర్నూలు జిల్లాకు చెందిన రాఘవయ్యతో 2014లో వివాహమైంది. అప్పటికి రాఘవయ్య ఎస్ఐ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. వివాహమైన 4 నెలల తర్వాత ఎస్సై శిక్షణకు వెళ్ళాడు. కొంతకాలానికి రాజకుమారి ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. శిక్షణకు వెళ్లినప్పటి నుంచి ఇప్పటి వరకు తన భర్త రాఘవయ్య తనకు ఎలాంటి ఫోన్ చేయలేదు.'' తనపై తప్పుడు ఆరోపణలతో కోర్టులో కేసు దాఖలు చేశాడని బాధితురాలు తెలిపింది. ఏ కారణం లేకుండా తనను కాపురానికి పిలిపించుకోవటం లేదని చెప్పింది. 'నాకు నా భర్త... నా బిడ్డకు తండ్రి కావాలి' అంటూ మీడియా ఎదుట వాపోయింది. లేదంటే చావే శరణ్యం అంటూ విలపించింది.