YS Viveka murder case: పోలీసులకు, సిట్ అధికారులకు తాను వాంగ్మూలం ఇవ్వలేదని... వైఎస్ వివేకానందరెడ్డి అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి సీబీఐకి తెలిపారు. అందులో ఉన్న అంశాలన్నీ పోలీసులు సృష్టించినవేనన్నారు. 2019 మార్చి 15న సీఐ శంకరయ్యకు తాను ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదన్నారు. 2019 మార్చి 16న మాత్రమే ఆయనకు వాంగ్మూలం ఇచ్చానన్న ఆయన... అందులో ఉన్న అంశాలు తాను చెప్పినవి కాదన్నారు. వారు సృష్టించినవేనన్నారు. వివేకా చనిపోయారంటూ ఆయన పీఏ ఎంవీ కృష్ణారెడ్డి 2019 మార్చి 15వ తేదీ ఉదయం 6 గంటల15 నిమిషాల సమయంలో తనకు ఫోన్ చేసి చెప్పారన్నారు. ఆ సమయంలో హైదరాబాద్‌లోని ఇంట్లో ఉన్నానన్న రాజశేఖరరెడ్డి .. ఏడున్నర గంటల సమయంలో హైదరాబాద్ నుంచి పులివెందులకు బయల్దేరామని సీబీఐకి తెలిపారు. ఎంవీ కృష్ణారెడ్డి ఫోన్ చేసి వివేకా మరణించారనే విషయం చెప్పేసరికి కర్నూలు వద్ద ఉన్నామని తాను చెప్పినట్లు వాంగ్మూలంలో ఉందన్నారు. అది తప్పు అన్న రాజశేఖరరెడ్డి... ఆయన ఫోన్ చేసేటప్పటికి తాము హైదరాబాద్‌లోనే ఉన్నామని తెలిపారు.
నేను అలా ఎప్పుడూ చెప్పలేదు..
వివేకా గుండెపోటుతో మరణించారని తాను భావించానని పోలీసులతో చెప్పినట్లు ఆ వాంగ్మూలంలో ఉందన్న నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి... కానీ తాను అలా ఎప్పుడూ చెప్పలేదన్నారు. వివేకా సతీమణి సౌభాగ్యమ్మ 2019 మార్చి 29న డీఎస్పీ నాగరాజుకు వాంగ్మూలం ఇచ్చినట్లుగా నమోదు చేశారన్నారు. ఆ రోజున ఆమె కడపలో కానీ, పులివెందుల్లో కానీ లేరని... హైదరాబాద్‌లో ఉన్నారని తెలిపారు. ఘటనా స్థలం వద్ద లభించిన లేఖను తన భార్య సునీత.. ఎంవీ కృష్ణారెడ్డి వద్ద నుంచి తీసుకుని మీడియా ఎదుటే సీనియర్ పోలీసు అధికారులకు ఇచ్చినట్లు వాంగ్మూలంలో ఉందన్నారు. సీఐ శంకరయ్య, డీఎస్పీ నాగరాజులు కావాలనే ఈ తప్పుడు వాంగ్మూలాలు సృష్టించారన్నారు. శవ పంచనామా సమయంలో తాము పులివెందుల్లో ఉన్నట్లు చెప్పేందుకు వీలుగా అలా చేశారన్నారు. వాస్తవంగా తాము ఆ సమయంలో హైదరాబాద్ నుంచి పులివెందులకు వచ్చే దారిలో ఉన్నామని... ఆ లేఖ గురించి ఏదో దాచిపెట్టాలనే ఉద్దేశంతోనే వారు ఇలా చేశారని రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.