ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Viveka Murder Case: నలుగురు అనుమానితుల చుట్టూనే వివేకా హత్య కేసు దర్యాప్తు - వివేకానందరెడ్డి హత్యకేసు

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ దర్యాప్తు ఆ నలుగురి చుట్టూనే తిరుగుతోంది. హత్యలో పాత్రధారులుగా అనుమానిస్తున్న సునీల్‌ యాదవ్‌, దస్తగిరి, ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్‌రెడ్డిని రోజూ సీబీఐ ప్రశ్నిస్తూనే ఉంది. దస్తగిరి ఇంట్లో రక్తపు మరకలతో కూడిన చొక్కాను సీబీఐ స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Vieka Murder Case
Vieka Murder Case

By

Published : Aug 13, 2021, 5:42 AM IST

Updated : Aug 13, 2021, 7:25 AM IST

వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించి.. కాపలాదారు రంగన్న ఇచ్చిన వాంగ్మూలం మేరకు నలుగురు వ్యక్తుల ప్రమేయంపై సీబీఐ లోతుగా దర్యాప్తు చేస్తోంది. సునీల్‌ యాదవ్‌, ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి, ఉమాశంకర్‌రెడ్డి పాత్రపై.. నిశితంగా విచారణ జరుపుతోంది. 2 నెలల నుంచి ఈ నలుగురిని వరుసగా విచారణకు పిలుస్తూనే ఉన్నారు. ఇప్పటికే సునీల్‌ యాదవ్‌ను కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. బుధవారం ఈ నలుగురి ఇళ్లే లక్ష్యంగా సీబీఐ సోదాలు నిర్వహించింది. వారి ఇళ్లలో కొన్ని ఆయుధాలు, చొక్కాలు, బ్యాంకు పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. వివేకా మాజీ డ్రైవర్‌ దస్తగిరి ఇంట్లో.. రక్తపు మరకలతో కూడిన చొక్కాను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక దస్తగిరిని కూడా అరెస్ట్‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నలుగురు అనుమానితుల చుట్టూనే వివేకా హత్య కేసు దర్యాప్తు

గురువారం ఉదయమే దస్తగిరితో పాటు.. కస్టడీలో ఉన్న సునీల్‌ యాదవ్‌ను వెంటబెట్టుకుని వివేకా ఇంటిని సీబీఐ అధికారులు పరిశీలించారు. అనంతరం పులివెందుల ఆర్ అండ్‌ బీ అతిథి గృహంలో ఉదయం నుంచి రాత్రి వరకు వారిని ప్రశ్నించారు. వీరితో పాటు వివేకా పీఏ కృష్ణారెడ్డిని విచారించారు.

ఏఎఫ్‌యూ రిజిస్ట్రార్‌ సురేంద్రనాథ్‌రెడ్డిని విచారించిన సీబీఐ

మాజీ మంత్రి వివేకానందరెడ్డి రక్తపు మడుగులో పడి ఉంటే మీరు సాధారణ మరణమని ఎలా అనుకున్నారని వైఎస్‌ఆర్‌ ఆర్కిటెక్చర్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ విశ్వవిద్యాలయం (ఏఎఫ్‌యూ) రిజిస్ట్రార్‌, ఈసీ గంగిరెడ్డి బంధువు సురేంద్రనాథ్‌రెడ్డిని పులివెందులలో సీబీఐ అధికారులు ప్రశ్నించగా, కంగారులో సరిగా గుర్తించలేక పోయానని బదులిచ్చినట్లు సమాచారం.

వివేకా కుమార్తె సునీత.. హైకోర్టులో వేసిన పిటిషన్‌లో పేర్కొన్న 15 మంది అనుమానితుల్లో ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి పేరూ ఉంది. ఈయనతో పాటు చెప్పుల దుకాణం యజమాని మున్నాను సీబీఐ బృందం ప్రశ్నించింది.

మరో సీబీఐ బృందం కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో అనుమానితుల విచారణ చేపట్టింది. ఎర్రగంగిరెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌ బంధువు భరత్‌ యాదవ్‌ను విచారించారు. హత్య జరిగిన రోజు రాత్రి.. సునీల్‌ యాదవ్‌ను ద్విచక్రవాహనంపై తీసుకెళ్లి వివేకా ఇంటి వద్ద వదిలింది భరత్‌ యాదవ్‌ అనే ప్రచారం జోరుగా సాగుతోంది. సునీల్‌ కుటుంబసభ్యులు.. భరత్‌ యాదవ్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.

ఆయుధాల స్వాధీనం..

అనుమానితుల ఇళ్లలో స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, వస్తువులు, దుస్తులు, బ్యాంకు పుస్తకాలను.. కడప కేంద్ర కారాగారం అతిథి గృహానికి తీసుకొచ్చి పరిశీలించే పనిలో సీబీఐ అధికారులు ఉన్నారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో సీజ్‌ చేసిన వస్తువులను వారి చేతనే తెలిపించేందుకు పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది. సునీల్‌ను కస్టడీకి తీసుకునే ముందు అతడి కుటుంబసభ్యులకు నోటీసు ఇవ్వలేదని.. అతడి తరఫు న్యాయవాది పులివెందుల కోర్టులో ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి:

ఏపీలో కృష్ణా బోర్డు పర్యటనపై.. తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం

Last Updated : Aug 13, 2021, 7:25 AM IST

ABOUT THE AUTHOR

...view details