Sri Ramanavami Brahmotsavam : వైఎస్సార్ జిల్లాలో అత్యంత చారిత్రాత్మక ప్రాశస్త్యం ఉన్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో ఈ నెల 30 నుంచి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్ 5న జరిగే శ్రీ సీతారాముల కళ్యాణానికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఒంటిమిట్ట పరిపాలన భవనంలో నిర్వహించిన సమావేశంలో అధికారులను ఆయన ఆదేశించారు.
సీతారాముల కళ్యాణోత్సవానికి సీఎం జగన్ :ముఖ్యంగా ఏప్రిల్ 5వ తేదీన జరిగే సీతారాముల వారి కళ్యాణోత్సవానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఉన్నందున పెద్ద సంఖ్యలో భక్తులతో పాటు ప్రముఖులు, అత్యంత ప్రముఖులు రావచ్చనే అంచనాతో అన్ని రకాల ఏర్పాట్లకు ప్రణాళిక సిద్ధం చేశామనీ జిల్లా కలెక్టర్ విజయ్ రామరాజు తెలిపారు. ఈ మేరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా, టీటీడీ, పోలీస్ అధికారులు సంయుక్తంగా, నిర్దిష్ట ప్రణాళికలతో విధులను నిర్వర్తించాలన్నారు. రాముల వారి కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు కళ్యాణ వేదిక ముందు ఏర్పాటు చేసిన ఒక్కో గ్యాలరీకి ఒకరిని ఇంఛార్జిగా నియమిస్తామన్నారు. ఎక్కడా కూడా తొక్కిసలాట జరగకుండా అధికారులు, పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.