ట్రాక్టర్ మెకానిక్... బ్యాటరీలతో వినూత్న ప్రయోగాలు - fan
కటిక పేదరికరం అతడి కుటుంబ నేపథ్యం. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. అక్షర జ్ఞానం లేక ట్రాక్టర్ మెకానిక్‌గా మారాడు. ఆ యువకుడిలోని సృజనను ఈ కష్టాలేవీ అడ్డుకోలేకపోయాయి. బ్యాటరీలతో వినూత్న వస్తువులను తయారు చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు ఆ కుర్రాడు.
కడప జిల్లా బద్వేలుకు చెందిన ఖాదర్ బాషా చదువుకోకపోయినా భిన్నమైన రీతిలో వస్తువులను తయారు చేస్తున్నాడు. ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు టోపీలకే చిన్న ఫ్యానులు ధరించడం, రాత్రి వేళల్లో వెలుగులు పంచేందుకు టోపీలకు చిన్న లైట్లు అమర్చడం వంటి వినూత్న వస్తువులను రూపొందిస్తున్నాడు. పగలంతా ట్రాక్టర్ మెకానిక్‌గా పని చేస్తూ... తీరిక సమయాల్లో బ్యాటరీలతో ప్రయోగాలు చేస్తున్నాడు. ఐదేళ్ల కిందటే తల్లిదండ్రులను కోల్పోయిన బాషా ప్రస్తుతం తన పినతల్లి వద్ద ఉంటున్నాడు. పేదరికం వెంటాడుతున్నా నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్నాడు. టోపీకే చిన్న మ్యూజిక్ బాక్సు ఏర్పాటు చేసుకునేలా తయారు చేశాడు. ఒక్కో వస్తువు తయారీకి 300 నుంచి 400 వరకూ ఖర్చు అవుతుందని తెలిపాడు. ప్రభుత్వం సాయం అందిస్తే ఇలాంటి వస్తువులను మరెన్నో రూపొందిస్తానని అంటున్నాడు.