Fake voters list: గెలుపే లక్ష్యం.. అక్రమాలే మార్గం! అన్నట్లుగా ఉంది అధికార పార్టీ వైఖరి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సాగిస్తున్న అక్రమాలు అనేకం కాగా.. ఓటరు జాబితాలు కూడా అందుకు మినహాయింపేం కాలేదు. విజయవాడ లో డోర్ నంబర్ లేకుండా 380 ఓట్లు నమోదు కాగా, గుంటూరులో ఒకే ఇంటి నంబర్ పేరిట 150 ఓట్లు చేరాయి. ఒకే వీధిలో ఓట్లు రిపీట్ కాగా,ఇక నంద్యాల జిల్లా నందికొట్కూరులో విచ్చలవిడిగా దొంగఓట్లునమోదు కాగా, సీఎం సొంత జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. కరోనా సమయంలో చనిపోయిన, పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన వారి ఓట్లు జాబితాలో అలాగే ఉండిపోయాయి.
ముఖ్యమంత్రి సొంత జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోమృతుల ఓట్లు ఎక్కువ సంఖ్యలోఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సుమారు 7 సంవత్సరాలుగా ఆ ఓట్లు ఉన్నా రెవిన్యూ సిబ్బంది తొలగించడంలో అలసత్వం వహిస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నైనా వాటిని తొలగించి అక్రమ ఓట్లను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
వైయస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో రెండు లక్షల 46 వేల పైచిలుకు ఓటర్లు ఉన్నారు. 2020, 2021 సంవత్సరాల్లో కరోనా బారిన పడి చాలా మంది ఓటర్లు మృతి చెందారు. ఆ ఓటర్లను తొలగించకపోవడంతో పాటు వలస వెళ్లినవారు, పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిన మహిళల ఓటర్లను సైతం తొలగించలేదన్న అపవాదు ఉంది. అలాంటి ఓటర్లను తొలగించేందుకురాజకీయ పార్టీ నాయకులు సుముఖత చూపడం లేదు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆ ఓట్లు కూడా కొంటే సానుభూతితో ఇంట్లోనే అందరూ తమకే ఓటు వేస్తారని పార్టీ నాయకులు ఆశపడుతున్నారు. 2019 సంవత్సరంలో సార్వత్రిక ఎన్నికల్లో దొంగ ఓట్లు అనేకం పోలవ్వగా.. 2021 మార్చిలో జరిగిన నగర పంచాయతీ ఎన్నికల్లో మృతుల ఓటును తొలగించకపోవడం గమనార్హం.
జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉండగా సుమారు 15 వేల మృతుల ఓట్లు ఉన్నట్లు సమాచారం. జమ్మలమడుగు నగర పంచాయతీ 104 పోలింగ్ కేంద్రంలో 1,117 ఓట్లు ఉండగా.. 547 మంది పురుషులు, 570 మంది మహిళలు ఉన్నారు. 2016 సంవత్సరం నుంచి ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు జరగలేదని స్థానిక ఓటర్లు వాపోతున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి అలాంటి ఓటర్లు గుర్తించి తొలగించాలని వారు కోరుతున్నారు. పూర్తి ప్రక్షాళనతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోపు కొత్త ఓటర్ జాబితాను విడుదల చేస్తామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. మృతుల ఓట్లతోపాటు వలస వెళ్లిన వారి ఓట్లను తొలగించి, వచ్చే ఏడాది జనవరి 5 లోగా కొత్త జాబితాన్ని విడుదల చేస్తామని జమ్మలమడుగు ఆర్డీఓ శ్రీనివాసులు తెలిపారు.