ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యురేనియం అనర్థాలపై ప్రభుత్వానికి కమిటీ నివేదిక

కడప జిల్లా తుమ్మలపల్లి యురేనియం బాధిత గ్రామాల్లో తక్షణమే వైద్య నిపుణుల బృందం పర్యటించాలని అధ్యయన కమిటీ ప్రభుత్వానికి సూచించింది. చర్మవ్యాధుల బారిన పడిన వారికి అత్యవసర చికిత్స చేయించాలని సిఫారసు చేసింది. బాధిత గ్రామాల్లో పర్యటించిన కమిటీ కర్మాగారం పనితీరు, బాధితుల అవస్థలపై సర్కారుకు పూర్తిస్థాయి నివేదిక సమర్పించింది.

యురేనియం

By

Published : Sep 12, 2019, 4:38 AM IST

Updated : Sep 12, 2019, 6:06 AM IST

కడప జిల్లా తుమ్మలపల్లి యురేనియం కర్మాగారం అనర్థాలపై ప్రభుత్వానికి అధ్యయన కమిటీ నివేదిక అందించింది. కర్మాగారం పనితీరు, యురేనియం బాధిత గ్రామాల పరిస్థితిపై అధ్యయనానికి ఈ నెల 9,10 తేదీల్లో క్షేత్రస్థాయిలో పర్యటించింది. యురేనియం ప్రభావంతో చర్మవ్యాధుల బారిన పడుతున్న గ్రామస్థులను, నాశనమవుతున్న పంటలను పరిశీలించింది. పరిస్థితి తీవ్రతను గమనించి రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలితో పాటు ప్రభుత్వానికి నిపుణుల బృందం నివేదిక అందజేసినట్లు సమాచారం.

యూసీఐఎల్ కారణమని చెప్పలేం

కేకే కొట్టాల, కనంపల్లి, మబ్బుచింతలపల్లి, భూమయ్యగారిపల్లి, రాచకుంటపల్లి పరిధిలో చర్మవ్యాధులతో బాధపడుతున్న వారు ఎక్కువగా ఉన్నారని కమిటీ గుర్తించింది. ఆయా గ్రామాల్లో చర్మవ్యాధులను నయం చేసేందుకు తక్షణమే వైద్య నిపుణులను పంపాలని ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. చుట్టు పక్కల గ్రామాల్లో కాలుష్యానికి యూసీఐఎల్ కారణమని నిర్దిష్టంగా చెప్పలేమని అభిప్రాయపడింది. టెయిల్‌పాండ్ వ్యర్థాలతో తాగునీరు కలుషితమైందన్న గ్రామస్థుల ఫిర్యాదుతో శుద్ధజలం సరఫరా చేయాలని కమిటీ సిఫారసు చేసింది. యూసీఐఎల్ అధికారులు, గ్రామస్థులకు అంతరం పెరిగినట్లు గుర్తించిన కమిటీ సమస్యల పరిష్కారానికి ప్రతినెలా సమావేశాలు నిర్వహించాలని నివేదించింది. సుహృద్భావ వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.

నిర్ణయం ఇక ప్రభుత్వానిదే

అధ్యయన కమిటీ అందించిన నివేదికపై ఇవాళో, రేపో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. యురేనియం బాధిత గ్రామాల్లో ఎలాంటి చర్యలు చేపట్టాలనేది ప్రభుత్వం నిర్ణయంపై ఆధారపడి ఉండనుంది.

ఇదీ చదవండి

"గాలి పీలిస్తే గర్భస్రావాలు... నీరు తాగితే వింత వ్యాధులు"

Last Updated : Sep 12, 2019, 6:06 AM IST

ABOUT THE AUTHOR

...view details