కడప జిల్లా రైల్వేకోడూరు పట్టణంలోని థామస్ హాస్పిటల్కు నియోజకవర్గంలో మంచి పేరుంది. అబ్రహం థామస్ ఇక్కడ పదేళ్ల నుంచి దంత వైద్యులుగా పని చేస్తున్నారు. ఈయన తండ్రి, తాత కూడా ఇదే హాస్పిటల్లో వైద్యులుగా సేవలందించారు. ప్రకృతి ప్రేమికుడైన డాక్టర్ అబ్రహం... పూర్వీకుల జీవనశైలికి ఆకర్షితులయ్యారు. హాస్పిటల్ ఎదురుగా ఉన్న తమ సొంత స్థలంలో ఔషద మొక్కలు పెంచుతున్నారు. పూర్వీకుల మాదిరిగానే రాళ్లు, మట్టితో ఓ పూరిల్లు నిర్మించుకుని... రోగులకు అందులోనే దంత చికిత్స చేస్తున్నారు. ఆసుపత్రికి వచ్చే వారికి పాతకాలపు ఆహారపు అలవాట్లపై, అప్పటి జీవనశైలిపై అవగాహన పెంచుతున్నారు. సమైక్య పేరుతో ఆసుపత్రి ప్రాంగణంలోనే ఓ దుకాణాన్ని ఏర్పాటు చేసి రాగులు, సజ్జలు, సాము బియ్యం, ఊదర్ల బియ్యం వంటి వాటిని విక్రయిస్తున్నారు. వీటిని నిత్యం ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలా వ్యాధులు దరిచేరవని థామస్ సూచిస్తున్నారు. అదే ప్రాంగణంలో చిన్న కొలను ఏర్పాటు చేసి తామర చెట్లను పెంచుతున్నారు. ఇలాంటి కొలనుల్లో స్నానం చేస్తే చర్మవ్యాధుల సమస్య ఉండదని అంటున్నారు.
పూరి గుడిసెలోనే వైద్యం... నిత్యం ప్రకృతితో మమేకం
దంత సమస్యలతో ఆ వైద్యుడి వద్దకు వెళ్లిన వారికి పూరి గుడిసెలోనే చికిత్స చేస్తాడు. ట్యాబ్లెట్స్కి బదులుగా చిరుధాన్యాలు, సాములు, ఊదర్ల బియ్యం వంటివి తినాలని సూచిస్తాడు. అంతేకాకుండా చిన్నారులకు కొత్త తరహా విద్యను సైతం అందించేందుకు కృషి చేస్తున్నాడు. కాంక్రీట్ ప్రపంచానికి దూరంగా పూర్వీకుల నాటి జీవనశైలిని అవలంబించేందుకు ప్రయత్నిస్తున్నాడు.
చిన్నారులకు కొత్త తరహా బోధనా
వైద్యంతో పాటు విద్యా బోధనలోనూ డాక్టర్ అబ్రహం ప్రత్యేకతను చాటుతున్నారు రైల్వే కోడూరులో లీలా లెర్నింగ్ పేరుతో స్కూల్ ఏర్పాటు చేసి.. పిల్లలకు కూచిపూడి, ఒడిసి వంటి సంప్రదాయ కళలు, సంగీతాన్ని నేర్పిస్తున్నారు. చిన్నారుల ఆసక్తిని గమనించి వారికి కావాల్సిన రంగాల్లో శిక్షణ ఇస్తున్నారు. వివిధ రంగాలకు చెందిన నిపుణులను ఇక్కడికి రప్పించి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. పూర్వీకుల జీవనశైలి, ప్రకృతి పట్ల ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు డాక్టర్ అబ్రహం థామస్ ప్రయత్నిస్తున్నారు.