TDP senior leader Varla Ramaiah fire on ex CID chief: సీఐడీ మాజీ చీఫ్ పి.వి.సునీల్ కుమార్‌పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తక్షణమే స్పందించి.. సునీల్ కుమార్ అవినీతి బాగోతంపై హైకోర్ట్ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీఐడీ చీఫ్‌గా సునీల్ కుమార్ విధులు నిర్వర్తించిన రోజుల్లో అతను అవినీతి మార్గాన సంపాదించిన డబ్బు, భూములు ఇతర స్థిర, చరాస్తులపై వర్ల రామయ్య మీడియా సముఖంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ.. పి.వి.సునీల్ కుమార్ సంపాదించిన అక్రమ ఆస్తులను ప్రభుత్వం వెంటనే స్వాధీనపరుచుకోవాలన్నారు. ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో బినామీల పేరిట సునీల్ కుమార్ పొలాలు కొన్నట్టు పోలీస్ శాఖ కోడై కూస్తోందని ఆయన ఆరోపించారు. చివరకు అమెరికాలో ఉండేవారిపై కూడా తప్పుడు కేసులు బనాయించి, సునీల్ కుమార్ వారి వద్ద నుంచి డబ్బులు గుంజాడని పోలీస్ శాఖ గుసగుసలాడుకుంటోందని వ్యాఖ్యానించారు. అవినీతి సొమ్ము పంపకాల్లో తేడాలు వచ్చే, జగన్ మోహన్ రెడ్డి అతన్ని నిర్దాక్షిణ్యంగా సీఐడీ పదవి నుంచి తొలగించి, నేటివరకూ ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా అలాగే ఉంచారని వర్ల రామయ్య ఆరోపించారు.
అనంతరం పి.వి.సునీల్ కుమార్.. 'మీ భార్య మీపై పెట్టిన కేసు ఏమైందో చెప్పగలరా?' అని వర్ల రామయ్య ప్రశ్నించారు. పి.వి. సునీల్ కుమార్‌కి రాజ్యాంగమన్నా, ప్రజాస్వామ్యమన్నా, చట్టాలన్నా గౌరవంలేదని.. జగన్ మోహన్ రెడ్డి చెప్పిందే అతనికి రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, చట్టాలని తీవ్రంగా మండిపడ్డారు. అంత నమ్మకంగా సీఎం జగన్ వద్ద పని చేసిన సునీల్ కుమార్.. చివరికి వాటాల విషయంలో ఎగిరికొడితే జీఐడీలో పడ్డారని ఎద్దేవా చేశారు. ఆ సంఘటన తర్వాత సునీల్ కుమార్.. విదేశీయాత్ర పేరుతో అమెరికాకు వెళ్లారని ఆయన గుర్తు చేశారు.