వైకాపా నాయకులు ఎన్ని ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడినా కడప జిల్లాలో తెదేపా మద్ధతుదారులు సర్పంచ్ స్థానాలను చాలా వరకు కైవసం చేసుకున్నారని తెదేపా కడప పార్లమెంటు అధ్యక్షుడు లింగారెడ్డి అన్నారు. జిల్లాలో 27 చోట్ల తెదేపా మద్దతుదారులు, మరో 8 చోట్ల తెదేపా బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారని ఆయన కడపలో తెలిపారు. గత ఎన్నికల్లో తెదేపా నేతలపై దాడులు చేయడం వంటి సంఘటనలు కాకుండా... ఈసారి పోలింగ్ బూతులు, కౌంటింగ్ కేంద్రాల వద్ద వైకాపా నాయకులు గుంపులుగా ఏర్పడి తమ వ్యూహాన్ని అమలు చేశారని ఆయన గుర్తు చేశారు.
జిల్లా కలెక్టర్, ఎస్పీ ఎన్నికల విధులను సక్రమంగా నిర్వహించినా....కొందరు కింది స్థాయి సిబ్బంది వైకాపాకు అనుకూలంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. ఖాజీపేట మండలం దుంపలగట్టు పంచాయతీలో ఐదుసార్లు గతంలో సర్పంచి స్థానాన్ని కైవసం చేసుకున్నామని....ఈసారి మాత్రమే వైకాపా ప్రలోభాలతో ఓటమి పాలైనట్లు తెదేపా రాష్ట్ర కార్యదర్శి రెడ్యెం వెంకటసుబ్బారెడ్డి పేర్కొన్నారు.