WEST RAYALASEEMA GRADUATE ELECTIONS : పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కచ్చితంగా విజయం సాధిస్తామని ఎమ్మెల్సీ బీటెక్ రవి, సత్యనారాయణ రాజు ధీమా వ్యక్యం చేశారు. పార్టీ అధిష్టానం మేరకు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ప్రతి రంగంలోని ఉద్యోగులు ముఖ్యమంత్రిపై అసంతృప్తిగా ఉన్నారన్నారు. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నారని.. యువత, నిరుద్యోగులు ప్రభుత్వంపై అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదని వివరించారు. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు పారిపోతున్నాయని ఎద్దేవా చేశారు.
పులివెందుల నుంచే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెక్ పెడతామని ఎమ్మెల్సీ బీటెక్ రవి అన్నారు. అందుకు స్థానిక నాయకుడైన రాంగోపాల్ రెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దింపామని వెల్లడించారు. వేంపల్లెలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రచారంలో వైసీపీ కంటే ముందే ఉంటామని అన్నారు. పులివెందులలోనే వైసీపీ కంటే టీడీపీ అభ్యర్థి ముందున్నాడని తెలిపారు. జగన్కు పులివెందులలోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే.. రాష్ట్రవ్యాప్తంగా ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. పులివెందులలో రాంగోపాల్ రెడ్డి ముందంజలో ఉన్నాడని ఆశాభావం వ్యక్తం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని తెలిపారు. ఈ పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో టీడీపీ విజయం సాధిస్తే.. ఆ ప్రభావం 2024 సాధారణ ఎన్నికలపై ఉంటుందని అన్నారు. ఉద్యోగులు, వ్యాపార వర్గాల వారిని ప్రభుత్వం ఏడిపిస్తోందన్నారు. అన్ని వస్తువుల ధరలు పెరిగిపోయాయని మండిపడ్డారు. ప్రజలు ప్రభుత్వంపై కోపంతో ఉన్నారని.. ఆవకాశం వచ్చినప్పుడు వారి కోపాన్ని చూపించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.