Concern of auto drivers : స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పథకంలో భాగంగా క్లాప్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ప్రతి మున్సిపాలిటీ, నగరపాలక సంస్థకు ఎలక్ట్రికల్ ఆటోలను సమకూర్చింది. రెండున్నరేళ్ల కిందట రెడ్డి ఏజెన్సీ ఆటోలను సమకూర్చి.. వాటి డ్రైవర్లకు వేతనాలు అందించేది. ఈ లెక్కన రాష్ట్రంలో 6,500 మంది డ్రైవర్లు పనిచేస్తున్నారు. కడప నగరపాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్లకు దాదాపు 75 ఎలక్ట్రికల్ ఆటోలను ఏర్పాటు చేశారు. ఈ ఆటోలు ఇంటింటికీ వెళ్లి తడిచెత్త, పొడిచెత్త సేకరిస్తున్నాయి. ప్రతి ఇంటి నుంచి 90 రూపాయల వరకు ప్రతినెలా వసూలు చేస్తున్నారు. గతంలో ఉన్న ఏజెన్సీ ఐదారు నెలలకు వేతనాలు ఇస్తుంటే.. కార్మికులు, డ్రైవర్లు ఆందోళనలు చేయడంతో ఆ ఏజెన్సీని మార్చేశారు.
ప్రతి నెలా 10వ తేదీన వేతనాలు.. ప్రస్తుతం కొత్త ఏజెన్సీ బాధ్యతలు తీసుకుని ప్రతినెలా 10వ తేదీలోపు వేతనాలను అందిస్తున్నారు. కాగా, డ్రైవర్ కు 10 నుంచి 11 వేల రూపాయలు మాత్రమే వేతనం అందిస్తున్నారని.. కనీస వేతన చట్టం అమలు చేయడం లేదని డ్రైవర్లు వాపోతున్నారు. దీంతోపాటు కార్మికులకు ఇవ్వాల్సిన పీఎఫ్, ఈఎస్ఐ డబ్బులు ఎక్కడ జమ చేస్తున్నారో తమకు తెలియడం లేదని నిట్టూరుస్తున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి గతంలో ఇచ్చిన మాట ప్రకారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కింద పనిచేసే ప్రతి కార్మికుడు, డ్రైవర్ కు కనీస వేతనం 15 వేల నుంచి 18 వేల రూపాయల వరకు అమలు చేస్తామని చెప్పినా అమలు కావడం లేదని తెలిపారు.