కడప జిల్లా ప్రొద్దుటూరులో ఏప్రిల్ 24 నుంచి గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు వేసవి తరగతులు నిర్వహిస్తున్నారు. 3 గ్రంథాలయాల పరిధిలో మొత్తం 45 వేల పుస్తకాలు అందుబాటులో ఉండగా... వాటిలో వెయ్యి పుస్తకాలు చిన్నారులకు సంబంధించినవే. ఏప్రిల్ 24 వరకు కేవలం పాఠ్య పుస్తకాలతో కుస్తీపట్టిన చిన్నారులు ఇప్పుడు... అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకుంటున్నారు. వేసవి సెలవుల్లో సమయాన్ని వృథా చేయకుండా... కొత్త కొత్త నీతి పుస్తకాలు చదువుతున్నారు.
ఆసక్తి పెంచుతున్న జిరాఫీ చెస్...
ఈ వేసవి తరగతుల్లో చిన్నారులు చాలారకాల అంశాలపై పట్టు సాధిస్తున్నారు. నిర్వాహకులు ప్రతిరోజూ గంట పాటు విద్యార్థులతో జిరాఫీ చెస్ ఆడిస్తున్నారు. చిన్నారులు కూడా దీనిపై రోజురోజుకూ ఆసక్తి చూపుతున్నారు. పోటీ పడి ఈ ఆటను నేర్చుకుంటున్నారు. స్పోకెన్ ఇంగ్లీష్, వ్యాయామం, నీతికథలు చెప్పడంతోపాటు పలు రకాల పుస్తకాలను చదివించే విధంగా శ్రద్ధ తీసుకుంటున్నారు నిర్వాహకులు. వీటితోపాటు కబడ్డీ, ఖోఖో ఆడిస్తూ.. చిన్నారుల్లో ఉత్సాహం నింపుతున్నారు.