చిన్నారులు నీటిలో ఆడుకోవడానికి ఎక్కువ మక్కువ చూపుతారు. ఈత వల్ల ఉత్సాహం, ఉల్లాసంతోపాటు ఆరోగ్యంగా ఉంటారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో విద్యార్థులు ఈత నేర్చకునేందుకు ముందుకొస్తున్నారు. గతంలో బావులు, చెరువుల్లో నేర్చుకునేవారు. ప్రస్తుతం అవి ఎండిపోవడంతో ఈత కొలనుల వైపు నడుస్తున్నారు. ఇక్కడ శిక్షకుల పర్యవేక్షణ ఉండటం... లోతు తక్కువగా ఉండటం వల్ల విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు.
పిల్లలకు వేసవి సెలవులు రావడంతో చాలా మంది తల్లిదండ్రులు ఈత నేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈత వల్ల శరీరం ధృఢంగా తయారై... ఆరోగ్యంగా ఉంటారు. త్వరగా బరువు తగ్గడానికి ఇది చక్కటి సాధనం. ఇలా ప్రొద్దుటూరులోని మొత్తం 5 ఈత కొలనుల్లో ప్రతిరోజూ వందలాది మంది చిన్నారులు శిక్షణ పొందుతున్నారు. ఉదయం రెండు బృందాలు, సాయంత్రం రెండు బ్యాచ్లకు తర్ఫీదు ఇస్తున్నారు. ఎర్రగుంట్ల, థర్మల్, జువారితోపాటు చుట్టు పక్కల గ్రామాల నుంచి విద్యార్థులు ప్రొద్దుటూరుకి వచ్చి ఈత నేర్చుకుంటున్నారు.