Tulasi Reddy Fired on Jagan: కర్ణాటక నిర్మిస్తున్న ఎగువ భద్ర ప్రాజెక్ట్‌తో రాయలసీమ ఎడారి కాక తప్పదనీ.. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే రాయలసీమ ప్రాంతంలోని తుంగభద్ర హై లెవల్ కెనాల్, లో లెవల్ కెనాల్, కేసి కెనాల్ ప్రాజెక్టులు నీరు లేక నిరుపయోగం అవుతాయనీ పీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా వేంపల్లెలోని ఆయన స్వగృహంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాయలసీమ ప్రాంతంలో 8 లక్షల ఎకరాల సాగు భూమి బీడు భూమిగా తయారవుతుందనీ.. నికర జలాల కేటాయింపు లేకుండానే కర్ణాటక ప్రభుత్వం 29.5 టీఎంసీల సామర్థ్యంతో 6 లక్షల ఎకరాలకు నీరు అందించే విధంగా ఎగువ భద్ర ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోందనీ ఆయన తెలిపారు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎగువ భద్ర ప్రాజెక్ట్‌ను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, 2023-24 బడ్జెట్లో రూ.5,300 కోట్లు కేటాయించిందన్నారు. ఇంత జరుగుతున్నా జగన్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం శోచనీయమన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను, ప్రత్యేకించి రాయలసీమ ప్రయోజనాలను.. మోదీ ప్రభుత్వానికి.. కర్ణాటక ఎన్నికల కోసం జగన్ ప్రభుత్వం పణంగా పెట్టిందని ఆరోపించారు. సీమ పట్ల ఏ మాత్రం ప్రేమ ఉన్నా.. జగన్ ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసి సమర్థ వాదనలు వినిపించి, కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్న అప్పర్ భద్ర ప్రాజెక్ట్‌ను ఆపు చేయించాలనీ ఆయన పేర్కొన్నారు. లేకుంటే రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో రాయలసీమ ప్రజలు జగన్ పార్టీనీ చిత్తు చిత్తుగా ఓడిస్తారనీ పీసీసీ మీడియా చైర్మన్ తులసి రెడ్డి అన్నారు.