ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైఎస్సార్​ జిల్లాలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా.. సొంతపార్టీ నాయకులే ఫిర్యాదు

YSRCP SAND MAFIA : ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. దొంగలు - దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు.. వైకాపా నాయకులు ఇసుక క్వారీలను దోచుకుంటున్నారు. పాపాగ్ని నుంచి ఇష్టారీతిన ఇసుక తవ్వి.. లారీలు, ట్రాక్టర్లతో భారీగా పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్నారు. సొంత పార్టీ నాయకులే దోపిడీపై అధికారులకు ఫిర్యాదు చేశారంటే.. పరిస్థితి తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

YSRCP SAND MAFIA
YSRCP SAND MAFIA

By

Published : Oct 2, 2022, 5:03 PM IST

వైఎస్సార్​ జిల్లాలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా.. సొంతపార్టీ నాయకులే ఫిర్యాదు

SAND MAFIA : వైఎస్సార్​ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఇదివరకు ఉన్న జేపీ వెంచర్స్ స్థానంలో.. అధికార పార్టీకి చెందిన నాయకులు.. ఉప గుత్తేదారుల అవతారం ఎత్తి దోపిడీకి పాల్పడుతున్నారు. కమలాపురం నియోజకవర్గంలో పాపాగ్ని నది నుంచి హిటాచీ, జేసీబీల సాయంతో ఇసుకను పెద్దఎత్తున తవ్వుతున్నారు. లీజు క్వారీ ‍ఒకచోట ఉంటే.. మరోచోట అక్రమ తవ్వకాలకు పాల్పడుతూ.. టిప్పర్లు, లారీలు, ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. జిల్లాలో 14 ఇసుక క్వారీలకు అధికారిక అనుమతులు ఉండగా.. వాటి ముసుగులో రెట్టింపు స్థాయిలో దోపిడీ జరుగుతోంది. కమలాపురం, వల్లూరు, పెండ్లిమర్రి మండలాల్లో పెద్దఎత్తున తవ్వకాలు సాగుతున్నాయని స్థానికులు తెలిపారు.

వల్లూరు మండలం తప్పెట్లలో ఇసుక అక్రమ తరలింపుపై సొంత పార్టీకి చెందిన వైకాపా నాయకుడు సుధాకర్ రెడ్డి.. రెవెన్యూ, మైనింగ్ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇసుక దోపిడీతో ఊళ్లలో భూగర్భ జలాలు అడుగంటాయని వాపోయారు. త్వరగా చర్యలు చేపట్టకుంటే ఎన్జీటీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.

చాపాడు, ఖాజీపేట, సిద్ధవటం మండలాల్లోనూ ఇసుక దందా యథేచ్చగా సాగుతోంది. ఖాజీపేట మండలంలోని వెదరూరు, చెముళ్లపల్లె మార్గంలోని పాపాగ్ని నుంచి వందల లారీల ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలిపోతోంది. వెదరూరులో ఇసుక రీచ్ లేకపోయినా తవ్వకాలు చేస్తుండటంపై మండిపడ్డ స్థానికులు.. న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు.

సిద్ధవటం మండలంలో జ్యోతి క్షేత్రం వద్ద 15 రోజుల కిందట జేపీ వెంచర్స్ పేరిట ఇసుకను తరలిస్తున్న వాహనాలను స్థానికులు అడ్డుకున్నారు. ఇపుడు నియోజకవర్గానికి చెందిన ఇద్దరు వైకాపా నాయకులు రెండు క్వారీలను పంచుకోవడంతో.. గ్రామస్థులు మిన్నకుండిపోయారు. పెద్దఎత్తున ఇసుక దోపిడీ జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇసుక దోపిడీపై తమకు ఫిర్యాదులు అందాయంటున్న అధికారులు.. వాటిని పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని చెబుతున్నారు. ప్రభుత్వం వీలైనంత త్వరగా ఇసుక దోపిడీని అరికట్టి భూగర్భ జలాలకు ఇబ్బందిరాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details