ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎర్రచందనం స్మగ్లింగ్​: అక్రమ రవాణాకు అటవీ సిబ్బంది సాయం - red sandalwood smuggling latest news

కంచే.. చేను మేసిన చందంగా.. అటవీ సంపదను కాపాడాల్సిన సిబ్బందే స్మగ్లర్లతో చేతులు కలిపి ఎర్రచందనం అక్రమ రవాణాకు సహకరిస్తున్నారు. అరణ్యంలో అణువణువు తెలియడంతో స్మగ్లర్లను తేలిగ్గా అడవి దాటించేస్తున్నారు. తాజాగా ఆరుగురు స్మగ్లర్లను కడప పోలీసులు అరెస్ట్ చేస్తే.. వారిలో ముగ్గురు గతంలో అటవీశాఖలో పనిచేసిన సిబ్బందే ఉండటం గమనార్హం..

red sandalwood smuggling
పోలీసులు స్వాధీన పరచుకున్న ఎర్రచందనం దుంగలు

By

Published : Apr 11, 2021, 2:03 PM IST

ఎర్రచందనం స్మగ్లింగ్​ వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ అన్బురాజన్

పదిరోజుల కిందట కడప జిల్లా రాజంపేట సమీపంలోని కంటైనర్​లో తరలిస్తున్న మూడు కోట్ల రూపాయలు విలువ చేసే ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిలో గతంలో అటవీశాఖలో పనిచేసిన ప్రొటెక్షన్ వాచర్ ఉండటం విశేషం. తీగలాగితే డొంక కదలినట్లు.. ఆ కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే ఇవాళ మరో ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్ల ముఠా పట్టుపడింది. వీరిలో కూడా ముగ్గురు అటవీశాఖలో ఔట్ సోర్సింగ్ విభాగంలో పనిచేసి మానేసిన సిబ్బంది ఉండటం గమనార్హం. పుల్లంపేట మండలం బోటుమీదపల్లి వంతెన సమీపంలోనే 600 కిలోల బరువున్న మేలు రకం ఎర్రచందనం దుంగలను అక్రమంగా తమిళనాడు ప్రాంతానికి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 60 లక్షల రూపాయల విలువ చేసే దుంగలు, కారు, బైక్, గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిని పట్టుకునే సమయంలో స్మగ్లర్లు.. పోలీసులపై ఎదురుదాడికి దిగినట్లు ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు. రాళ్లతో దాడిచేసినా పోలీసులు తప్పించుకుని స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ ఆరుగురు స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన ఆరుగురు స్మగ్లర్లలో కుర్నూతల ప్రభాకర్ అనే వ్యక్తి విశ్రాంత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కుమారుడు. హరిక్రిష్ణ, అనుంపల్లి రవి అనే వ్యక్తులు గతంలో అటవీశాఖలో ప్రొటెక్షన్ వాచర్లుగా పనిచేశారు. వీరిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు ఎస్పీ తెలిపారు.

ఇదీ చదవండి:స్మగ్లర్ల కాల్పులు- ఇద్దరు పోలీసులు మృతి!

జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాపై పోలీసుశాఖ కఠినంగా వ్యవహరిస్తోందని ఎస్పీ తెలిపారు. 2019లో 48 ఎర్రచందనం కేసులు నమోదు కాగా 223 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేసి 887 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. 21 టన్నుల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. 2020లో 53 కేసులు నమోదు చేయగా.. 269 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. 14 టన్నుల ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. 2021 నుంచి ఏప్రిల్ వరకు 20 కేసులు నమోదు చేసి.. 191 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేయడమే కాకుండా ఐదు టన్నుల ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఇప్పటివరకు 15 మంది బడా స్మగ్లర్లను అరెస్ట్ చేయడంతోపాటు 12 మందిపై పీడీయాక్టు కేసులు నమోదు చేశామని వెల్లడించారు. ఎర్రచందనం అక్రమ రవాణపై పోలీసుశాఖ ఉక్కుపాదం మోపడానికి సిద్ధంగా ఉందని.. దీనికి ప్రజల సహకారం కూడా అవసరమని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:ఎర్రచందనం అక్రమ రవాణా..ఆరుగురు అరెస్టు

ABOUT THE AUTHOR

...view details