ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

rains in kadapa: గుండె చెరువాయె.. బతుకు బరువాయె.. ముంపు గ్రామాలను వీడని వరద భయం!

భారీ వర్షాలు(rains in kadapa) కడప జిల్లా బతుకు చిత్రాన్ని మార్చేశాయి. వర్షాలు తగ్గినా వరద ప్రభావం ఇప్పటికీ వీడలేదు. అన్నమయ్య ప్రాజెక్టు నీళ్లు.. ప్రభావిత గ్రామాలను తుడిచిపెట్టేశాయి. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. చెయ్యేరు పరివాహక ప్రాంతంలో ఏరూ.. ఊరూ.. ఏకమయ్యేలా ముంచెత్తిన వరద.. పచ్చని పొలాలను మింగేసింది.

people suffer with heavy rains and floods in kadapa
బతుకు చిత్రాన్ని మార్చేసిన భారీ వర్షాలు

By

Published : Nov 21, 2021, 9:14 PM IST

గ్రామాలను తుడిచిపెట్టేసిన అన్నమయ్య ప్రాజెక్టు వరద


వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాలు, వరద కడప జిల్లా(floods in kadapa)ను అతలాకుతలం చేశాయి. పింఛా, అన్నమయ్య ప్రాజెక్టులు, చెయ్యేరు సమీప ప్రాంతాల ప్రజలు సర్వం కోల్పోయారు. ముఖ్యంగా రాజంపేట మండలం తొగూరుపేటను అన్నమయ్య ప్రాజెక్టు(annamayya project) వరద ముంచేసింది. ప్రాజెక్టులో పనిచేసే ఓ ప్రైవేటు వ్యక్తి హెచ్చరికతో అప్రమత్తమైన తొగూరుపేట ప్రజలు.. ఉన్నపళంగా ఇల్లూ, వాకిలీ వదిలేసి కట్టుబట్టలతో, పిల్లాపాపలతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. ఊరికి సమీపంలోని దాసరి అమ్మవారి ఆలయం కొండమీదకు వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు. పరిస్థితి కొంచెం కుదుటపడిందని తిరిగి వచ్చి చూసేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చేయ్యేరు ఉద్ధృతికి అనేక ఇళ్లు కొట్టుకుపోయాయి. ఇళ్లలో దాచుకున్న ధాన్యం, వంట సామాగ్రి, బట్టలు సహా అన్ని వస్తువులూ నాశనమయ్యాయి. పదుల సంఖ్యలో పశువులు మరణించాయి. ఎటుచూసినా నిస్సహాయంగా ఉన్న ప్రజల కన్నీళ్లే దర్శనమిస్తున్నాయి.

ఇది ప్రకృతి వైపరీత్యం కాదు.. ప్రభుత్వ వైఫల్యమే: చెంగల్రాయుడు
తొగూరుపేట సహా ప్రభావిత గ్రామాల్లో తెదేపా నేత చెంగల్రాయుడు పర్యటించి.. బాధితుల్ని పరామర్శించారు. ఇది ప్రకృతి వైపరీత్యం కాదని.. ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు పరిహారమిచ్చి ఆదుకోవాలని.. తామూ సాయం చేస్తామని చెప్పారు. అధికారుల నిర్లక్ష్యంతో కట్టుబట్టలతో రోడ్డున పడ్డామని.. స్వచ్ఛంద సంస్థల సాయంతో కడుపు నింపుకుంటున్నామని తొగూరుపేట ప్రజలు కన్నీరుమున్నీరయ్యారు.

రామచంద్రపురాన్ని ముంచెత్తిన వరద
రాజంపేట మండలం రామచంద్రపురాన్ని భారీ వరద ముంచెత్తింది. పెద్ద పెద్ద భవనాలన్నీ నీటికి కొట్టుకుపోయాయి. పచ్చని పొలాలతో కళకళలాడిన గ్రామం ఇప్పుడు ప్రజలు లేక వెలవెలబోతోంది. రామచంద్రపురం ప్రజల్లో చాలా మంది.. తలదాచుకునేందుకు పట్టణాల్లోని బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు. వరద ఉద్ధృతికి ఇళ్లలోని వస్తువులన్నీ బయట పడ్డాయి. ఇళ్లు ఏమాత్రం నివాసయోగ్యంగా లేకుండా పాడైపోయాయి. వర్షాలు, వరద జీవితాల్ని పూర్తిగా నాశనం చేసిందని.. ఎలా బతకాలో తెలీడం లేదని ప్రజలు వెక్కివెక్కి ఏడుస్తున్నారు.

నీలిపల్లి అస్తవ్యస్తం
నందలూరు మండలం నీలిపల్లిని చెయ్యేరు నది అస్తవ్యస్తం చేసింది. వరద కారణంగా అనేక షెడ్లు, భవనాలు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. ఇళ్లు దెబ్బతిని.. ఇంట్లో వస్తువులు చాలా వరకు పనికిరాకుండా మారాయి. పశువులు పెద్దసంఖ్యలో మృతిచెందాయి. కనీసం ఆహారం, నీరు కూడా అందించేవారు లేక ప్రజలు, పిల్లలు విలవిల్లాడుతున్నారు.

స్వచ్ఛంద సంస్థల సహకారంతో కడుపు నింపుకుంటున్న స్థానికులు
కడప జిల్లాలో వరద బాధిత గ్రామాల్లో అన్నిచోట్లా ఇదే పరిస్థితి నెలకొంది. దాదాపు ప్రతిచోటా స్వచ్ఛంద సంస్థల సహకారంతో కడుపు నింపుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి నామమాత్ర సాయం కూడా అందడం లేదని బాధితులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

Papagni Bridge drone video : కూలిన పాపాగ్ని వంతెన

ABOUT THE AUTHOR

...view details