ఎంబీబీఎస్, దంత వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్)-2019 ఫలితాల్లో రాజస్థాన్‌కు చెందిన నళిన్ ఖండేల్ వాల్ జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించారు. 720 మార్కులకు ఖండేల్ వాల్‌కు 701 మార్కులు వచ్చాయి. దిల్లీకి చెందిన భవిక్ బన్సాల్, యూపీకి చెందిన అక్షిత్ కౌశిక్‌లకు సమానంగా 700 మార్కులు వచ్చాయి. భవిక్ బన్సాల్‌కు అక్షిత్ కౌశిక్ కన్నా జీవశాస్త్రంలో ఎక్కువ మార్కులు రావడంతో ద్వితీయ ర్యాంకు కేటాయించారు. అక్షిత్ కౌశిక్ తృతీయ ర్యాంకు పొందారు. దివ్యాంగుల అభ్యర్థుల్లో రాజస్థాన్‌కు చెందిన భెరారామ్ 604 మార్కులతో టాపర్‌గా నిలిచారు.
తెలుగు కీర్తి రెపరెపలు...
నీట్‌లో తెలుగమ్మాయిలు సత్తా చాటారు. తెలంగాణ విద్యార్థిని జి.మాధురి రెడ్డి 695 మార్కులతో జాతీయస్థాయిలో ఏడో ర్యాంకు సాధించగా.. బాలికల కేటగిరీలో మొదటి ర్యాంకుతో మెరిశారు. అలాగే, 690 మార్కులతో కడప జిల్లాకు చెందిన విద్యార్థిని ఖురేషీ అస్రా 16వ ర్యాంకులో నిలిచారు. నిరంతర కృషి, ప్రణాళికాబద్ధంగా కష్టపడి చదవడం, కళాశాల యాజమాన్యం అందించిన ప్రోత్సాహం వల్లే తమకు ఈ విజయం సొంతమైందని వారు "ఈటీవీ భారత్"తో సంతోషం వ్యక్తం చేశారు.