AVINASH REDDY ATTENDED TO CBI ENQUIRY : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా కడప ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి కోఠిలోని సీబీఐ కార్యాలయంలో అవినాశ్‌రెడ్డిని సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్ నేతృత్వంలోని బృందం విచారించింది. ఈ కేసులో ఇప్పటికే 248 మంది వాంగ్మూలాన్ని సీబీఐ అధికారులు సేకరించారు. ఈ వాంగ్మూలాల ఆధారంగా.. ఎస్పీ రాంసింగ్ నేతృత్వంలోని సీబీఐ బృందం అవినాశ్ రెడ్డిని ప్రశ్నించింది.
నాలుగున్నర గంటలు సాగిన విచారణ: సీబీఐ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన అనంతరం అవినాశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీబీఐ అధికారులు ఇచ్చిన 160 సీఆర్‌పీసీ నోటీసుల ప్రకారం విచారణకు హాజరైనట్లు తెలిపారు. విచారణ పారదర్శకంగా జరగాలని సీబీఐని కోరినట్లు తెలిపారు. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానన్న అవినాశ్.. సీబీఐ అధికారులకు ఉన్న అనుమానాలను తన సమాధానాలతో నివృత్తి చేసినట్లు పేర్కొన్నారు. మళ్లీ ఎప్పుడు విచారణకు రమ్మన్నా వస్తానని చెప్పినట్లు తెలిపారు. ప్రజలకు కేసుకు సంబంధించిన వివరాలు తెలియాలని వీడియో, ఆడియో అనుమతి కోరానని.. అందుకు అధికారులు అంగీకరించలేదన్నారు. నాలుగున్నర గంటల పాటు సీబీఐ అధికారులు తనని విచారించినట్లు వెల్లడించారు. విచారణకు సంబంధించిన విషయాలు ఏవీ ఇప్పుడు బహిర్గతం చేయలేనని తెలిపారు. కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నాయి అని అవినాశ్ రెడ్డి తెలిపారు.
"సీబీఐ అధికారులు ఇచ్చిన 160 సీఆర్‌పీసీ నోటీసుల ప్రకారం విచారణకు హాజరయ్యా. విచారణ పారదర్శకంగా జరగాలని సీబీఐని కోరా. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చాను. మళ్లీ ఎప్పుడు విచారణకు రమ్మన్నా వస్తానని చెప్పా. నాలుగున్నర గంటల పాటు సీబీఐ అధికారులు నన్ను విచారించారు. విచారణకు సంబంధించిన విషయాలు ఏవీ ఇప్పుడు బహిర్గతం చేయలేను. కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని నాపై దుష్ప్రచారం చేస్తున్నాయి"-వైఎస్ అవినాశ్ రెడ్డి, కడప ఎంపీ
మధ్యాహ్నం 3గంటలకు విచారణకు హాజరు కావాలని అవినాశ్ రెడ్డికి సీబీఐ అధికారులు పంపిన నోటీసుల్లో పేర్కొన్న ఈ నేపథ్యంలో ఆయన మధ్యాహ్నం 2.45 నిమిషాలకు సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. అవినాశ్ రెడ్డితో పాటు న్యాయవాది నగేశ్ కూడా ఉన్నారు. అంతకుముందు తన విచారణను ఆడియో, వీడియోలు రికార్డు చేయాలని.. తనతో పాటు న్యాయవాదిని కూడా అనుమతించాలని అవినాశ్ రెడ్డి సీబీఐ అధికారులకు లేఖ రాశారు. అయితే, ఈ లేఖకు సంబంధించి అధికారులు సమాధానం ఇచ్చారా? లేదా? అనేదానిపై స్పష్టత లేదు.
మూడేళ్లుగా కొనసాగుతున్న వివేకా హత్య కేసు దర్యాప్తు: వివేకా హత్య కేసుకు సంబంధించి దాదాపు మూడేళ్లుగా సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. 2019 మార్చిలో వివేకా హత్య జరిగినప్పటి నుంచి దాదాపు ఏడాది తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసు విచారణను ప్రారంభించింది. ఇప్పటికే 248 మందిని ప్రశ్నించి వారి నుంచి వాంగ్మూలాన్ని సీబీఐ అధికారులు సేకరించారు. ఇంతమందిని ప్రశ్నించినప్పటికీ తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాశ్ రెడ్డిని మాత్రం ఇప్పటి వరకు ప్రశ్నించలేదు. ప్రతిపక్షాలు కూడా ప్రధానంగా అతనిపై వేలెత్తి చూపుతున్న నేపథ్యంలో పూర్తి సమాచారం సేకరించిన తర్వాతే అవినాశ్ రెడ్డిని ప్రశ్నించాలని సీబీఐ అధికారులు భావించారు. ఇందులో భాగంగానే ఆయనకు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరుకావాల్సిందిగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అవినాశ్ రెడ్డి ఇవాళ విచారణకు హాజరయ్యారు.
వివేకా హత్య కేసులో ఐదుగురికి సమన్లు:మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ప్రధాన, అనుబంధ ఛార్జిషీట్‌లను తెలంగాణ సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది. వివేకా హత్య కేసుకు సీబీఐ కోర్టు ఎస్‌సీ/01/2023 నంబర్ కేటాయించింది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితులు ఎర్ర గంగిరెడ్డి, సునీల్, ఉమాశంకర్, దస్తగిరి, శివశంకర్ రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 10న విచారణకు రావాలని ఆదేశించింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సుప్రీంకోర్టు తెలంగాణకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. కేసును హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం గతంలోనే వెల్లడించింది. ఈ విచారణపై మరణించిన వ్యక్తి కుమార్తె, భార్య అసంతృప్తిగా ఉన్నందున ప్రాథమిక హక్కులను పరిగణనలోకి తీసుకుని కేసును కడప న్యాయస్థానం నుంచి హైదరాబాద్ బదిలీ చేస్తున్నట్లు విచారణ సందర్భంగా జస్టిస్ ఎం.ఆర్.షా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు కడప జిల్లా సెషన్స్ కోర్టులో ఉన్న హత్య కేసుకి సంబంధించిన అన్ని ఫైళ్లు, ఛార్జ్ షీట్లు, సాక్షుల వాంగ్మూలాలు, దస్త్రాలను.. 3 బాక్సుల్లో హైదరాబాద్ ప్రిన్సిపల్ సీబీఐ కోర్టుకి తరలించారు.
ఇవీ చదవండి: