ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడప "కుంభస్థలం" కొడతారా...?

కడప గడపలోకి చొచ్చుకెళ్లేందుకు... తెదేపా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. మరికొద్ది రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కడప గడ్డపై పసుపు పతాకం ఎగరేసేందుకు ఉవ్విళ్లూరుతోంది. ప్రతిపక్ష వైకాపా కంచుకోటగా ఉన్న చోటే ఆ పార్టీని దెబ్బతీయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. పార్లమెంట్​కు గట్టి అభ్యర్థిని నిలిపి... ఎక్కువ ఎమ్మెల్యే సీట్లను గెలవాలన్న  వ్యూహాన్ని అమలు చేస్తోంది. మరి... తెదేపా ప్రయత్నాలు ఎంత వరకూ ఫలిస్తాయి... ? అక్కడ ఫ్యాను స్పీడును ఏమాత్రం తగ్గించగలుగుతుంది...?

రసవత్తరంగా కడప రాజకీయం

By

Published : Feb 26, 2019, 11:39 AM IST

Updated : Feb 27, 2019, 3:16 PM IST

రాష్ట్రంలో ఎక్కడ వైకాపా దూసుకెళ్తుందని ప్రశ్నిస్తే... ముందు గుర్తొచ్చే... పేరు కడప. వైఎస్ కుటుంబానికి పుట్టినిల్లైన కడప గడ్డ.. వైకాపాకు పెట్టని కోట. 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2014 ఎన్నికల్లో 9 చోట్ల వైకాపా అభ్యర్థులే గెలిచారు. రాజంపేట మినహా... మిగిలిన అన్ని చోట్లా ఫ్యాను గాలే వీచింది. ఈసారీ తమదే హవా అంటూ వైకాపా చెబుతుండగా... సొంతగడ్డపైనే వైకాపాకు షాక్ ఇవ్వాలని పసుపుదళం ప్రయత్నాలు చేస్తోంది. దాదాపు రెండేళ్ల కిందటి నుంచే ప్రణాళికలు అమలు చేస్తూ వస్తోంది.
ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెదేపా వ్యూహాలకు మరింత పదును పెడుతోంది. అభివృద్ధి... రాజకీయంతో వైకాపాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తన సహజ వైఖరికి భిన్నంగా ఈసారి అభ్యర్థుల ఎంపికను ముందే పూర్తి చేస్తూ.. చంద్రబాబు దూసుకెళ్తున్నారు. తాజాగా కడప, రాజంపేట పార్లమెంటు నియోజకవర్గాలపై చర్చల సందర్భంగా... కడప జిల్లాలో బరిలో నిలిచే అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి వచ్చింది. జిల్లాకు చెందిన మంత్రి ఆదినారాయణరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్​రెడ్డి సూచనల మేరకు అభ్యర్థుల ఎంపిక పూర్తైంది.

రసవత్తరంగా కడప రాజకీయం
కడప జిల్లాకు సంబంధించి... కడప పార్లమెంటు స్థానమే అత్యంత కీలకం. కొడితే... కుంభస్థలాన్నే కొట్టాలని.. తెదేపా ఈసారి దీనిపై గట్టిగానే దృష్టి సారించింది. దాదాపు 4దశాబ్దాలుగా.. వైఎస్ కుటుంబ సభ్యులే ఇక్కడి నుంచి బరిలోకి దిగుతున్నారు. ప్రత్యర్థి పార్టీలెప్పుడూ ఈ సీటుపై ఆశ పెట్టుకోలేదు. ఈసారి కడప సీటుపై తెదేపా గురిపెట్టింది. వైకాపా నుంచి.. తెదేపాలోకి వచ్చి మంత్రైన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని బరిలో నిలిపింది.ఎట్టి పరిస్థితుల్లోనూ... కడపను గెలుచుకోవాలని... అవసరమైతే.. దూకుడుగా వెళ్లాలని మంత్రి ఆదినారాయణరెడ్డికి చంద్రబాబు పచ్చజెండా ఊపారు. దీని కోసం జమ్మలమడుగు సీటు పంచాయతీ చేసిన చంద్రబాబు... రామసుబ్బారెడ్డి- ఆదినారాయణరెడ్డి మధ్య సయోధ్య కుదిర్చారు. కడప ఎంపీ స్థానం పరిధిలోకి వచ్చే పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం, బద్వేలు, కడప నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికలో ఆదినారాయణరెడ్డికి ప్రాధాన్యం ఇచ్చారు.పులివెందులకు మాజీ ఎమ్మెల్సీ సతీశ్​కుమార్ రెడ్డి, జమ్మలమడుగుకు రామసుబ్బారెడ్డిని ఖరారు చేశారు. మైదుకూరు నుంచి తితిదే ఛైర్మన్ పుట్టా సుధాకర్​యాదవ్​ను బరిలోకి దింపనున్నారు. మంత్రి ఆదికి, మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డికి మధ్య సంబంధాలు సరిగా లేవని తెలిసి పుట్టా సుధాకర్​ను తెరపైకి తీసుకొచ్చారనే ప్రచారం జరుగుతోంది. కమలాపురం కోసం మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి పోటీ పడినా చంద్రబాబు పుత్తావైపే మొగ్గారు.బద్వేలు... ఎస్సీ రిజర్వుడ్ స్థానం. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ చెప్పిన వారికే టికెట్ ఇస్తారన్న ఆది ప్రకటన ఆశావాహులు విజయజ్యోతి, ఎమ్మెల్యే జయరాములను నిరాశలోకి నెట్టింది. బద్వేలు బరిలో లాజరసును ఉంచాలని విజయమ్మ సూచిస్తున్నారు. ఇక కడప అభ్యర్థి ఎంపిక తలనొప్పిగా మారింది. ఇటీవలే పార్టీలో చేరిన మాజీమంత్రి అహ్మదుల్లా తన కుమారుడు అష్రఫ్​ ఇంఛార్జ్​గా ఉన్న ఈ స్థానాన్ని జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్​రెడ్డి కూడా ఆశిస్తున్నారు. మంత్రి ఆది కూడా శ్రీనివాస్​రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.ప్రొద్దుటూరు అభ్యర్థి ఖరారు కొలిక్కి రాలేదు. మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులరెడ్డి, లింగారెడ్డి వర్గాలుగా విడిపోయి పార్టీకి తీవ్ర నష్టం చేకూర్చారనే భావన అధినేత దృష్టిలో ఉంది. ఇక్కడ అభ్యర్థి ఎంపిక తర్వాత చూద్దామని సీఎం వాయిదా వేశారు. రాయచోటికి రమేష్​కుమార్ రెడ్డి, రాజంపేట బత్యాల చెంగల్రాయుడు, రైల్వే కోడూరు నరసింహ ప్రసాద్ పేర్లు దాదాపు ఖరారైనట్టే. రాజంపేట స్థానం నుంచి.. కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్ తన కుటుంబంలో ఒకరికి ఆ స్థానం ఇవ్వమని కోరుతున్నా... పార్టీ అధిష్ఠానం ఇంకా తేల్చలేదు. మాజీ ఎంపీ డీకే ఆదికేశవులులు కుమారుడు.. శ్రీనివాస్.. కూడా ఈ స్థానం కోసం పోటీపడుతున్నారు.ఎలాగైన కడపలో జగన్ ప్రభావం తగ్గించాలని గత రెండేళ్ల నుంచి తెదేపా పావులు కదిపింది. కనీసం 5 స్థానాల్లో గెలిచేలా వ్యూహ రచన చేసింది. అభ్యర్థుల ఎంపిక... పార్టీ బలోపేతంపైనే కాకుండా... జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా... కృష్ణా జలాలను కడప జిల్లాకు తీసుకొచ్చారు. స్టీల్ ప్లాంటు పనులు మొదలుపెట్టారు. పులివెందుల అన్నదాతలకు సాగునీరు అందించారు. రేషన్‌కార్డులు, సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల అభివృద్ధి, పారిశ్రామిక... గృహనిర్మాణంలోనూ, విద్యాపరంగా ఇలా అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు. రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడినా కడప జిల్లా ప్రగతిపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధచూపారు.
Last Updated : Feb 27, 2019, 3:16 PM IST

ABOUT THE AUTHOR

...view details