ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒక్కసారి నమ్మి ఆదరించండి, ఎవ్వరూ చేయని విధంగా అభివృద్ధి చేస్తానన్న పవన్​ - పవన్ న్యూస్

Pawan Kalyan Fire On Jagan పద్యం పుట్టిన రాయలసీమ నేలలో మద్యం ప్రవహిస్తోందని జనసేన అధినేత పవన్ మండిపడ్డారు. వైఎస్సార్ జిల్లా సిద్ధవటం కౌలు రైతు భరోసా బహిరంగ సభలో పాల్గొన్న పవన్ బాధిత కౌలు రైతు కుటుంబాలను పరామర్శించి ఆర్థికసాయం అందజేశారు. అనంతరం మాట్లాడిన ఆయన ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కౌలు రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. కౌలు రైతులకు కనీసం గుర్తింపు కార్డులు కూడా ఇవ్వటం లేదన్నారు. జనసేనను ఒక్కసారి నమ్మి ఆదరిస్తే ఎవరూ చేయని విధంగా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు.

పద్యం పుట్టిన రాయలసీమ నేలలో మద్యం ప్రవహిస్తోంది
పద్యం పుట్టిన రాయలసీమ నేలలో మద్యం ప్రవహిస్తోంది

By

Published : Aug 20, 2022, 7:14 PM IST

Updated : Aug 20, 2022, 7:38 PM IST

ఎవ్వరూ చేయని విధంగా అభివృద్ధి చేస్తానన్న పవన్​

Pawan Kalyan Fire On YSRCP: కులమతాలపై రాజకీయాలు చేస్తే దేశం విచ్ఛిన్నం అవుతుందని జనసేన అధినేత పవన్‌ అన్నారు. తానెప్పుడూ కులమతాల గురించి ఆలోచించనని చెప్పారు. మన దేశ సామాజిక మూల లక్షణం కులమని వ్యాఖ్యనించారు. వైఎస్సార్ జిల్లా సిద్ధవటం కౌలు రైతు భరోసా బహిరంగ సభలో పాల్గొన్న పవన్.. బాధిత కౌలు రైతు కుటుంబాలను పరామర్శించి ఆర్థికసాయం అందజేశారు. మూడేళ్లలో ఉమ్మడి కడప జిల్లాలో 173 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని.. వారి కుటుంబాలకు లక్ష చొప్పున మెుత్తం కోటి 73 లక్షలు అందజేశారు.

అనంతరం మాట్లాడిన పవన్.. పద్యం పుట్టిన రాయలసీమ నేలలో మద్యం ప్రవహిస్తోందని దుయ్యబట్టారు. ఇంటింటికీ చీప్ లిక్కర్ వచ్చిందని ఇక్కడి యువత చెబుతున్నారన్నారు. కౌలురైతులకు సరిగా గుర్తింపు కార్డులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఉపాధి లేకుంటే చదువుకున్న యువత ఏం చేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎవరి కాళ్లపై వారు నిలబడేలా ప్రభుత్వం ప్రోత్సహించాలన్నారు. తానెప్పుడూ వ్యక్తులపై పోరాటం చేయనని.. భావాలపైనే తన పోరాటం ఉంటుందన్నారు. తానెప్పుడూ పదవి కోరుకోలేదని సమాజంలో మార్పును మాత్రమే కోరుకున్నట్లు వెల్లడించారు.

"కులమతాలపై రాజకీయాలు చేస్తే దేశం విచ్ఛిన్నం అవుతుంది. వారసత్వ రాజకీయాలకు కొంతైనా అడ్డుకట్ట వేయాలి. అన్న పట్టించుకోలేదని చెల్లెలు మరో పార్టీ పెట్టారు. రాయలసీమలోని మాదిగ, మాల కులాల గురించి ఆలోచించారా? బోయ, కురబ, పద్మశాలి, బలిజల గురించి ఆలోచించారా?. వెనుకబడిన కులాల గురించే ఎప్పుడూ ఆలోచిస్తా. రాయలసీమలోని రెడ్డి, క్షత్రియ కులాల్లోనూ పేదలున్నారు. కులం, మతం, ప్రాంతం దాటి వచ్చిన మనిషిని నేను. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం జరిగితే ఇక్కడ యూరియా ధర పెరిగింది. పెద్ద కులాలు ఘర్షణ పడితే సమాజంలో అనేక ఇబ్బందులు వస్తాయి." -పవన్‌, జనసేన అధినేత

సమాజం ఎప్పుడూ ఒకేలా ఉండకూడదని మార్పు రావాలని పవన్ అన్నారు. రెడ్డి, కమ్మ కులాలతోపాటు మిగతా కులాలకూ సాధికారత రావాలన్నారు. రాజకీయాల వెనుక ఉన్న కష్టనష్టాలు తనకు తెలుసునన్నారు. వైకాపా ప్రభుత్వం పనుల వల్ల రెడ్డి కులానికీ నష్టం జరుగుతోందని చెప్పారు. సొంత బాబాయిని చంపినవారినీ ఇంకా ఎందుకు పట్టుకోలేదని పవన్‌ నిలదీశారు. సుగాలి ప్రీతి ఘటన కేసు నిందితులను ఇంకా పట్టుకోలేదన్నారు. సీఎంగా ఉన్న మీకు.. రాష్ట్ర పోలీసులపైనే మీకు నమ్మకం లేదా అని ప్రశ్నించారు.

"రాయలసీమ యువతకు ఉపాధి అవకాశాలు ఎందుకు లేవు? రాయలసీమ నుంచి అనేకమంది సీఎంలు వచ్చినా ఇక్కడ మార్పు రాలేదు. ఇక్కడి నేతల్లో ఆధిపత్య ధోరణి బాగా పెరిగింది. తమ ముందు ప్రతి ఒక్కరూ చేతులు కట్టుకోవాలనేది వారి ఉద్దేశం. ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గ్రాంట్‌ ఇవ్వడం లేదు? పోలవరం, కేసీ కెనాల్‌, ఉక్కు పరిశ్రమకు నిధులు ఎందుకు అడగరు? కేసులున్న వారు దిల్లీలో గట్టిగా అడగలేరు. ఒక్కసారి జనసేనను నమ్మి ఆదరించండి. ఎవ్వరూ చేయని విధంగా రాయలసీమను అభివృద్ధి చేస్తా. మార్పు కోసమే మీ ముందు జనసేన నిలబడింది. మేం అధికారంలోకి వస్తే వ్యవస్థలను బలోపేతం చేస్తాం. రాయలసీమలోని వెనుకబడిన వారంతా తలెత్తుకునేలా చేస్తాం." -పవన్‌, జనసేన అధినేత

ఇవీ చూడండి

Last Updated : Aug 20, 2022, 7:38 PM IST

ABOUT THE AUTHOR

...view details