ఒకప్పటి వర్గ శత్రువులు.. రాజకీయ ప్రత్యర్థులు..ఇప్పుడు ఒకే బండిపై పయనించాల్సిన పరిస్థితి వచ్చింది. కడప జిల్లా జమ్మలమడుగులో చిరకాల రాజకీయ ప్రత్యర్ధులుగా ఉన్న మంత్రి ఆదినారాయణరెడ్డి, మాజీమంత్రి రామసుబ్బారెడ్డి...తెదేపా నుంచి టికెట్ కోసం పోటీపడాల్సి వచ్చింది. జమ్మలమడుగులో పొన్నపురెడ్డి... ఆది నారాయణరెడ్డి కుటుంబాల మధ్య చాలా కాలం పాటు వర్గపోరు సాగుతూ వస్తోంది. ఈ స్థానం నుంచి పొన్నపురెడ్డి శివారెడ్డి 3సార్లు ఎమ్మెల్యేగా గెలవగా... తర్వాత ఆయన తమ్ముడి కుమారుడిగా, రాజకీయ వారుసుడి రాజకీయాల్లోకి వచ్చిన రామసుబ్బారెడ్డి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో వైకాపా తరఫున ఆదినారాయణరెడ్డి గెలిచి.. అనంతరంతెదేపాలోకి వచ్చారు. అప్పుడే..టిక్కెట్ పంచాయితీ మొదలైంది. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా సిట్టింగ్ స్థానంలో ఉన్న నేత సీటు దక్కించుకుంటారా...? అలా చేస్తే 2 దశాబ్దాలకుపైగా తెదేపా అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డిపైనే పోరాడుతూ వస్తున్న రామసుబ్బారెడ్డి ఊరుకుంటారా.. అనే సందిగ్ధం తలెత్తింది. అయితే పార్టీ అధినేత తనదైన స్టైల్లో ఫినిషింగ్ టచ్ ఇచ్చేశారు. జమ్మలమడుగు జగడంలో ఇదే టర్నింగ్ పాయింట్..!
ఎంపీగా ఆయన.. ఎమ్మెల్యేగా ఈయన!
జమ్మలమడుగు.... ఎన్నికల కూత పెట్టకముందే అధికార పార్టీలోనే కాదు కడప జిల్లా రాజకీయాల్లో హీట్ పెంచింది ఈ నియోజకవర్గం. జమ్మలమడుగు జగడానికి పరిష్కారమేంటి అన్న సమయంలో.. తెదేపా అధినేత చంద్రబాబు చాకచక్యంగా వివాదాన్ని పరిష్కరించారు. ఎమ్మెల్సీగా ఉన్న రామసుబ్బారెడ్డితో రాజీనామా చేయించిన చంద్రబాబు... జమ్మలమడుగు అసెంబ్లీ స్థానంలో పోటీ పెట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి ఆదినారాయణరెడ్డిని కడప ఎంపీగా బరిలోకి దింపారు. రామసుబ్బారెడ్డి స్థానంలో ఆదినారాయణ రెడ్డి కుటుంబసభ్యులకు ఎమ్మెల్సీ స్థానాన్ని ఇచ్చేశారు.
కలిసి ప్రచారం
ఎన్నికలకు ముందు చేతులు కలిపిన రాజకీయ ప్రత్యర్థులు.. నేడు కలసికట్టుగా ప్రచారం చేస్తున్నారు. ఆది విజయం కోసం రామసుబ్బారెడ్డి ... సుబ్బారెడ్డి కోసం ఆది.. ఒకరికి ఒకరు అన్నట్లుగా పనిచేస్తున్నారు. రెండు కుటుంబాలమహిళలూ..నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
జమ్మలమడుగు నియోజకవర్గంలో ఇద్దరు బలమైన నేతలు తెదేపాలో ఉండటం ఆ పార్టీకి కలిసొచ్చే అంశంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నియోజకవర్గంలో తెదేపా ప్రభుత్వం భారీ స్థాయిలో చేపట్టిన అభివృద్ధి పనులతోపాటు... కంబాలదిన్నె వేదికగా ఉక్కు పరిశ్రమ ఏర్పాటు వంటి అంశాలు తమకు లాభిస్తుయాని ధీమాను వ్యక్తం చేస్తోంది పసుపు దళం. వైరం వీడిన ఆది, రామ... ఇద్దరూ పార్టీని గెలిపిస్తారన్న దృఢ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తోంది.