తెదేపాలో చాలా రోజులుగా నానుతున్న జమ్మలమడుగు పంచాయితీకి అధినేత చంద్రబాబు చెక్ పెట్టారు. ఆ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేయాలో తేల్చేశారు. బద్ద శత్రువులైన.. రామసుబ్బారెడ్డి.. ఆదినారాయణరెడ్డిలను ఒక చోటకు చేర్చారు. దీంతో అత్యంత సంక్షిష్టంగా ఉన్న జమ్మలమడుగు సమస్యను కొలిక్కితెచ్చారు. ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉన్న రామసుబ్బారెడ్డి తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే.. తన కుటుంబంలో ఒకరికి ఎమ్మెల్సీ ఇవ్వాలంటూ ఆదినారాయణ రెడ్డి వర్గం పెట్టిన షరతుకు రామసుబ్బారెడ్డి అంగీకారం తెలిపారు. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి లేఖను పార్టీ అధినేతకు అందజేశారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే స్థానం కోసం పట్టు పట్టిన ఇద్దరు నేతల బెట్టు విడారు. రామసుబ్బారెడ్డి జమ్మలమడుగు ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. ఆదినారాయణ రెడ్డి కడప ఎంపీగా బరిలో దిగనున్నారు.
ఎవరైతే ఎంపీగా పోటీ చేస్తారో వారికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని గతంలో చంద్రబాబు చెప్పారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీ పదవికి రామసుబ్బారెడ్డి రాజీనామా చేయాలని ఆది నారాయణరెడ్డి వర్గం షరతులు పెట్టడమే ఇక్కడ చర్చనీయాంశమైంది. ఈ మేరకు రామసుబ్బారెడ్డి రాజీనామా చేయడం.. వివాదానికి శుభం కార్డు పడేలా చేసింది. కడప జిల్లా జమ్మలమడుగు నుంచి దశాబ్దాలుగా.. రామసుబ్బారెడ్డి కుటుంబమే.. తెదేపా తరపున పోటీచేస్తోంది. 2014లో రామసుబ్బారెడ్డి..పోటీ చేసి.. ఆదినారాయణరెడ్డి చేతిలో ఓడిపోయారు.
అయితే.. ఆదినారాయణరెడ్డి అనూహ్యంగా తెదేపాలోకి రావడం.. కడపలో ఉన్న రాజకీయ అనివార్యతల కారణంగా చంద్రబాబు ఆయనకు మంత్రిపదవి ఇవ్వడమూ జరిగాయి. ఈ పరిణామంతో జమ్మలమడుగు సీటు ఎవరిదనే పంచాయతీ మొదలైంది. రెండు కుటుంబాల మధ్య దశాబ్దాలుగా ఉన్న ఫ్యాక్షన్ గొడవల కారణంగా ఎవ్వరూ వెనక్కి తగ్గే పరిస్థితి లేకపోవడంతో తెదేపా ఈ సమస్యను ఎలా దారికి తెస్తుందనే చర్చ మొదలైంది. రాష్ట్రంలోనే ఇది అత్యంత సంక్షిష్టమైన స్థానంగా భావించారు.
ఇరువురిలో ఒకరిని ఎంపీగా పోటీచేయిస్తే ఒకరికోసం ఒకరు పనిచేయక తప్పనిపరిస్థితి నెలకొంటుందని . . జమ్మలమడుగు స్థానంలో వచ్చే మెజారిటీ కడప పార్లమెంట్‌పై ప్రభావం చూపి వైకాపాకు గట్టి పోటీ ఇచ్చినట్లవుతుందని చంద్రబాబు భావించారు. ఎంపీగా పోటీ చేసేవారికి పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని స్పష్టమైన హామీ ఇచ్చినా...కార్యకర్తలు తమను ఎమ్మెల్యేగా పోటీచేయమంటున్నారంటూ ఇద్దరు నేతలూ బెట్టుచేశారు. అధినేత వద్ద జరిగిన చర్చల్లో ఈ సమస్య పరిష్కారమైంది.