నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం ఈ జైన క్షేత్రం కడప జిల్లా జమ్మలమడుగులోని దానవులపాడు జైన క్షేత్రం పూర్వం కళకళలాడేది. రాష్ట్రంలోని అతి ముఖ్యమైన క్షేత్రాలలో ఇది ఒకటి. పేరుకే గొప్ప.. ఇప్పుడు ఎవరూ ఈ క్షేత్రాన్ని పట్టించుకునేవారు లేరు. పురావస్తు శాఖ అధికారులు ఇక్కడ అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలో మన దేశాన్ని జైన, బౌద్ధ మతాలు ఎంతో ప్రభావితం చేశాయి. క్రీస్తుపూర్వం 696 మధ్యకాలంలో కడప జిల్లా దానవులపాడు గ్రామాన్ని జైనులు నివాసంగా ఏర్పరుచుకున్నారు. గతంలో తవ్వకాలు జరిపినప్పుడు సుమారు 11 అడుగుల సున్నపు రాయితో తయారు చేసిన మొదటి తీర్థంకరుడైన విగ్రహం బయటపడింది. విగ్రహం తలపై ఏడు పడగల సర్పం ఉంది.
క్రీస్తు శకం 10వ శతాబ్ధంలో రాష్ట్రకూటుల పాలనలో మూడో ఇంద్రుని కాలంలో ఈ జైన క్షేత్రం ప్రసిద్ధి పొందింది. పక్కనే ఉన్న పెన్నా నదిలోకి దిగేందుకు 18 తాపలు ఏర్పాటు చేశారు. మెట్లకింద రాతి బండలపై గణపతి, చెట్టుపై వానరాలు, నాగదేవతలు, గజరాజు బొమ్మలు చెక్కారు. వరదల తాకిడికి దెబ్బతినకుండా సుమారు ఏడు మైళ్ల వరకు రక్షణ కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. విగ్రహం కోసం పక్కనే ఆలయ నిర్మాణం చేపట్టగా అది అసంపూర్తిగానే మిగిలిపోయింది. జయంతి రామయ్య పంతులుద్వారా ఈ క్షేత్రం 1975లో వెలుగులోకి వచ్చింది. ఇంతటి ప్రాముఖ్యమున్న క్షేత్రాన్ని ఇప్పుడు పట్టించుకునేవారు లేరు. ఈ కారణంగా పర్యాటకులు అంతంతమాత్రమే వస్తున్నారు. పురావస్తు శాఖ అధికారులు స్పందించి అభివృద్ధి చేస్తే పర్యటక పరంగా వృద్ధి చెందుతుందని పలువురు కోరుతున్నారు.
ఇదీ చదవండి:'కరోనా' సెలవుల్లో.. పిల్లలతో ఇలా చేయించండి!