Houses Demolished in Kadapa District రోడ్ల విస్తరణ పేరుతో కడప నగరపాలిక పరిధిలో పేదల ఇళ్ల కూల్చివేత నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. రెండు నెలల నుంచి ఇదే పనిలో ఉన్న అధికారులు, రెవెన్యూ సిబ్బంది ఇప్పుడు మాసాపేటపై గురిపెట్టారు. నాలుగైదు రోజుల నుంచి రోడ్డుకు ఇరువైపుల ఉన్న పేదల ఇళ్లను జేసీబీలతో కూల్చివేస్తున్నారు. సామాన్లు తీసుకునే సమయం కూడా ఇవ్వకుండా శుక్రవారం చాలా ఇళ్లు పడగొట్టారు. ఈ ప్రాంతంలో ద్విచక్ర వాహనాలు, ఆటోలు మినహా ఎలాంటి పెద్ద వాహనాలు తిరగడం లేదు. కనీసం ఆర్టీసీ బస్సులు కూడా రావు. అయినా మాసాపేట రహదారిని 80 నుంచి 100 అడుగుల మేర విస్తరణ చేయాలంటూ ఇళ్లను కూల్చివేశారు. ప్రభుత్వ భూమిలో ఇళ్లు నిర్మించుకున్నారంటూ.. ఏళ్ల తరబడి ఉంటున్న ఆవాసాలు కూల్చివేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు.
"మేము తరాల తరబడి ఇక్కడే ఉంటున్నాము. మా నాన్న ఇళ్లు కట్టుకోలేని పరిస్థితి ఉంటే.. నేను కువైట్ వెళ్లి అక్కడ పని చేసి వచ్చినా తర్వాత ఇక్కడ ఇళ్లు కట్టుకున్నాము. ఇప్పుడు ఇల్లు కూల్చటంతో ఏక్కడకి వెళ్లి తల దాచుకోవాలి. నాకు పెళ్లై చిన్న పాప ఉంది." - బాధితుడు
మాసాపేట కాలనీలో ఎక్కువగా ఎస్సీలు నివాసం ఉంటున్నారు. మాటమాత్రమైనా చెప్పకుండా వారి ఇళ్లను నగరపాలక అధికారులు కూల్చివేశారు. ఇళ్లలోని సామాన్లు తీసుకునే సమయం ఇవ్వకుండానే పొక్లెయిన్లతో ధ్వంసం చేశారు. సమయం ఇవ్వాలని కాళ్లావేళ్లాపడినా కనికరించలేదు. ఎలాంటి వాహనాలు తిరగని ప్రదేశం, ట్రాఫిక్ లేని ప్రాంతానికి 100 అడుగుల రోడ్డు ఎవరికోసమో చెప్పాలంటున్నారు. నగరంలో ప్రధాన రహదారులు ఇరుకుగా ఉన్నా పట్టించుకోని అధికారులు.. వాహనాలే తిరగని చోట రోడ్డు వెడల్పు చేయడం ఎవరికోసమని ప్రశ్నించారు. ఇళ్ల కూల్చివేయడం వల్ల.. చంటిబిడ్డలు, వద్ధులతో సహా రోడ్డున పడ్డామని వాపోయారు. ఎలాంటి పరిహారం ఇవ్వకుండా ఇళ్లు కూలదోస్తే ఎక్కడికి వెళ్లి బతకాలని నిలదీస్తున్నారు.