వివేకా కుమార్తె, అల్లుడు దాఖలు చేసిన వ్యాజ్యంలో ప్రమాణపత్రం దాఖలు చేయాల్సి ఉందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. వేరే వ్యాజ్యాల్లో ఇప్పటికే దాఖలు చేశారు కదా అని న్యాయమూర్తి ప్రశ్నించగా... సునీత లేవనెత్తిన ఆరోపణలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కౌంటర్ వేసేందుకు అవకాశం ఇచ్చారు. సీఎం జగన్ తరఫున న్యాయవాది వివేక్ వాదనలు వినిపించారు. తమ వ్యాజ్యంలో ఎలాంటి ఉత్తర్వులు అవసరంలేదని, పిటిషన్‌ను మూసివేయాలని న్యాయమూర్తిని కోరారు. ఆ అభ్యర్థనపై సునీత తరఫు సీనియర్ న్యాయవాది వీరారెడ్డి అభ్యంతరం తెలిపారు. ఈ హత్య కేసు దర్యాప్తును సీబీఐకి ఎందుకు ఇవ్వరాదని న్యాయమూర్తి మరోమారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
'ఆ పిటిషన్‌ను ఎందుకు మూసివేయాలో చెప్పండి..?' - viveka murder case latest news
మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ... గతంలో తాను దాఖలు చేసిన పిటిషన్‌ను మూసివేయాలని సీఎం జగన్ హైకోర్టును కోరారు. తన వ్యాజ్యంపై ఇకమీదట ఎలాంటి ఉత్తర్వులూ అవసరం లేదని తెలిపారు. ఈ అంశంపై వివేకా కుమార్తె ఎన్.సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డి, తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి, వ్యాజ్యాలతో కలిపి విచారణ ప్రారంభమైన వెంటనే... వాయిదా వేయాలన్న అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వినతిని న్యాయమూర్తి నిరాకరించారు.
సీఎం జగన్ తరఫు న్యాయవాది వివేక్ చేసిన అభ్యర్థనపై న్యాయమూర్తి యూ. దుర్గాప్రసాదరావు స్పందిస్తూ... వ్యాజ్యాన్ని ఎందుకు మూసేయాలని కోరుతున్నారో రాతపూర్వక కారణాలు తెలియజేస్తూ మెమో దాఖలు చేయాలని స్పష్టం చేశారు. తదుపరి విచారణను ఈనెల 13 వాయిదా వేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో లేని స్వతంత్ర సంస్థకు కానీ... సీబీఐకి గానీ అప్పగించాలని మృతుడి భార్య వైఎస్ సౌభాగ్యమ్మ, అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండీ... రాష్ట్రాభివృద్ధికి ఏఐఐబీ దన్ను..!