కడప జిల్లాలో ఒకటి నుంచి తొమ్మిదోతరగతి వరకూ 1,75,311 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీళ్లకు అందాల్సిన ఒక జత బూట్లు, 2జతల సాక్సులు అందించాలని నిర్ణయించింది. గడిచిన ఏడాది విద్యార్థుల సంఖ్య ప్రకారం ఒకటి నుంచి తొమ్మిదోతరగతి చదివే వారికి సరఫరా చేశారు. కడప జిల్లాకు 1,74,404 జతల బూట్లు, 3,48,808 జతల సాక్సులను అందించారు. వాటిల్లో కొన్నింటిని ఆయా మండాలాల్లోని బడులకు అందించామని అధికారులు చెబుతున్నారు. అయితే బాలల సంఖ్యకు తగ్గట్టు అందలేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. అరకొరగా సరఫరా చేయడంతో అవస్థలు పడుతున్నారు.
విద్యార్థులకు అందించాల్సిన బూట్లును కొన్నాళ్లు ఇవ్వవద్దని ఉన్నాధికారుల నుంచి మండల అధికారులకు ఆదేశాలు అందడంతో ప్రస్తుతం వాటి పంపిణీ ఆగిపోయింది. దీంతో ఎంఆర్‌సీ కేంద్రాల్లో బూట్లు, సాక్సులు మూలన పడి ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ విద్యా సంవత్సరం ఊహించిన దానికంటే విద్యార్థులు సర్కారు పాఠశాలల్లో ఎక్కువగా చేరారు. వీరికి బూట్లు, సాక్సులను అందించలేదు.ఈ కారణంగా వారు నిరాశ చెందుతున్నారు. చేసేదేమీలేక పాదరక్షకలతోనే బడికి వస్తున్నారు. తోటి స్నేహితులు బూట్లు ధరించి బడికి వస్తుండటాన్ని చూసి తమకు ఎప్పుడు ఇస్తారోనని ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బూట్లు సరఫరా చేసి పిల్లలకు అందించాలని పలువురు కోరుతున్నారు.
విద్యార్థులకు అందించే బూట్లు బాగానే ఉన్నా.. సాక్సులు మాత్రం నాసిరకంగా ఉన్నాయి. కాళ్లకు వేసుకునేలోపే చిరిగిపోయేంత పతలాగా ఉన్నాయి. బూట్లతో పాటు వాటిని ధరించినా అవి ఎక్కువ రోజులు ఉండవని ఉపాధ్యాయులు అంటున్నారు. అలాంటి వాటిని సరఫరా చేయడం ఎందుకు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. లక్షల రూపాయలు ఖర్చు చేసి నాసిరకంగా ఉన్న వాటిని అందించడంతో విద్యార్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల మళ్లీ డబ్బులు చెల్లించి సాక్సులు కొనుగోలు చేయాల్సి వస్తోందంటూ తల్లిదండ్రులు అంటున్నారు. ఉన్నతాధికారులు ఈ విషయం పై దృష్టి సారించి ఇలాంటి నాసిరకంగా ఉన్న సాక్సులు మళ్లీ సరఫరా చేయకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. అయితే నూతనంగా చేరిన విద్యార్థులకు మళ్లీ బూట్లు, సాక్సులను అందించాలని ఉన్నతాధికారులను కోరతామని సర్వశిక్షా అభియాన్ అధికారులు చెబుతున్నారు.