రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గోదావరి జలాలను కృష్ణానదిలోకి తీసుకురావాలనే విషయంపై చర్చిస్తున్న సమయంలో... రాయలసీమకు తాగునీటి సమస్య ఎలా పరిష్కరిస్తారనే విషయం చర్చనీయాంశమైంది. ఈ అంశంపై కడప ప్రెస్ క్లబ్ లో సీపీఐ ఆధ్వర్యంలో "కృష్ణా, గోదావరి, పెన్నా నదుల అనుసంధానం-రాయలసీమ నీటి సమస్య" అనే అంశంపై చర్చ జరిగింది. మాజీమంత్రి మైసూరా రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి, కమ్యూనిస్టు నేతలు, రాయలసీమ రైతు సంఘం ప్రతినిధులు, రాజకీయ నాయకులు, మేథావులు హాజరయ్యారు.
కేసీఆర్ కుట్రలో భాగమే...
గోదావరి జలాలను శ్రీశైలంలోకి మళ్లించి తద్వారా నాగార్జునసాగర్ నుంచి పాలమూరు, రంగారెడ్డి, డిండి వంటి ఎత్తి పోతల పథకాలకు నీళ్లు మళ్లించుకోవడానికి కేసీఆర్ కుట్ర పన్నారని నేతలు మండిపడ్డారు. కేసీఆర్ పన్నే కుయుక్తులకు సీఎం జగన్ అవగాహన రాహిత్యంతో అంగీకరిస్తున్నారని తులసిరెడ్డి మండిపడ్డారు. గోదావరి మిగులు జలాలను వాడుకునే హక్కు దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు ఉంటుంది గానీ... కేసీఆర్ దయాదాక్షిణ్యాల మీద కాదనే విషయం జగన్ గుర్తు పెట్టుకోవాలని సూచించారు. గోదావరి జలాలను శ్రీశైలంలోకి మళ్లిస్తే రాష్ట్రాన్ని థార్ ఏడారిగా మారుస్తారని ఆందోళన వ్యక్తం చేశారు.