కడప జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా ఔత్సహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందివ్వాలని కలెక్టర్ సి. హరి కిరణ్ తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా పారిశ్రామిక ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశం నిర్వహించారు. పారిశ్రామిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని అన్నారు. యువతకు ఉపాధి ఇచ్చి నైపుణ్యాభివృద్ధి కల్పనలో.. శిక్షణ అందించి యువ పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలన్నారు.
జిల్లాలో అందుబాటులో ఉన్న వనరులను ముడి సరుకుగా ఉపయోగించి.. ఉత్పత్తులను అభివృద్ధి చేసేలా.. అవగాహన పెంచాలన్నారు. తద్వారా జిల్లా ఆర్ధిక ప్రగతి కూడా మెరుగుపడుతుందన్నారు. పారిశ్రామిక అభివృద్ధి పాలసి - 2015-20ని అనుసరించి ఈ ఏడాది ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహక రాయితీ కోసం... ఎంఎస్ఎంఈ లు దరఖాస్తు చేసుకున్నాయి. అర్హతల మేరకు ప్రస్తుతం జిల్లాలో మొత్తం 84 యూనిట్లకు గాను కేటగిరీల వారీగా ప్రోత్సాహక రాయితీ మొత్తం 4,37,13,950 లను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు.