CM Jagan Kadapa Tour: ప్రభుత్వ పథకాలను అత్యంత పారదర్శకంగా అందిస్తున్నామని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో అందరికీ సంక్షేమ ఫలాలు అందాలని ఆకాంక్షించారు. కడప జిల్లా పర్యటనలో పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. రెండున్నర ఏళ్లలో ప్రొద్దుటూరు లబ్ధిదారులకు రూ.326 కోట్లు బదిలీ అయ్యాయని గుర్తు చేశారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఇళ్ల నిర్మాణం వేగవంతం చేశామన్నారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు పైపులైనుకు శ్రీకారం చుట్టామని సీఎం పేర్కొన్నారు.
'ప్రజల ఆశీస్సులతోనే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నా. ప్రొద్దుటూరు లబ్ధిదారుల ఖాతాలకు రూ.326 కోట్లు బదిలీ చేశాం. ప్రొద్దుటూరులో ఇంటి స్థలాలకు రూ.200 కోట్లు మంజూరు చేశాం. ప్రొద్దుటూరులో 10,220 మందికి ఇంటిస్థలాలు ఇచ్చాం. కోర్టు కేసుల ఇబ్బందులు అధిగమించి నిర్మాణ పనులు చేపట్టాం. ప్రొద్దుటూరులో తాగునీటి పైప్‌లన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి. మైలవరం జలాశయం నుంచి 170 కి.మీ. పైపులైను నిర్మాణం చేపట్టాం. డ్రైనేజీ వ్యవస్థను ఆధునికీకరిస్తున్నాం. అందుకుగానూ రూ.163 కోట్లు కేటాయించాం. 171 కిలోమీటర్ల పొడవైన అధునాతన పైపు లైను ఏర్పాటు చేస్తున్నాం. ప్రొద్దుటూరులో సీవరేజ్ ప్లాంట్, ఆర్టీపీపీ రోడ్డుపై వంతెన నిర్మిస్తాం. ప్రొద్దుటూరులో రూ.51 కోట్లతో కూరగాయల మార్కెట్ నిర్మిస్తున్నాం. రూ.24 కోట్లతో డిగ్రీ కళాశాల రూపురేఖలు మారుస్తున్నాం. రూ.63 కోట్లతో ఇంజినీరింగ్ కళాశాల భవనాలు నిర్మిస్తాం. పింఛ, అన్నమయ్య ప్రాజెక్టుల వల్ల నష్టపోయిన వారికి అండగా ఉంటా.' - జగన్, ముఖ్యమంత్రి
ప్రొద్దుటూరు నుంచి గోపవరం చేరుకున్న సీఎం జగన్.. కాశీనాయన పోలీస్‌స్టేషన్, బి.కోడూరు పశువుల ఆసుపత్రి, బద్వేలు ఆర్డీవో కార్యాలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. బద్వేలు ఆర్డీవో కార్యాలయానికి ప్రభుత్వం రూ.6 కోట్లు మంజూరు చేసింది. వీటితోపాటు రూ.1600 కోట్ల వ్యయంతో చేపడుతున్న మేజర్స్ సెంచరీ ప్లై పరిశ్రమకు సీఎం శ్రీకారం చుట్టారు. ఈ కంపెనీ ద్వారా ప్రత్యక్షంగా 2 వేల మందికి, పరోక్షంగా 4 వేల మందికి ఉపాధి లభించనుంది.